
ఫుడ్ డెలివరీ రైడర్లకు రోజూ రకరకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. చాలా మంది వినియోగదారుల నుంచి ఎదురవుతున్న వింత అనుభవాల గురించి చెబుతూ వాపోతుంటారు. కొందరు వినియోగదారుల వింత ప్రవర్తనతో డెలివరీ రైడర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. తాజాగా ఒక డెలివరీ రైడర్‌కు ఎదురైన సంఘటన మాత్రం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కస్టమర్‌కు డెలివర్ చేయడానికి వెళ్లిన చిరునామా ఒక సమాధి స్థలం (గ్రేవ్‌యార్డ్)’గా ఉండటంతో ఆ రైడర్ తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకోవడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఒక ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా అర్ధరాత్రి ఓ మహిళ బిర్యానీ ఆర్డర్ చేసింది. ఆర్డర్ వచ్చిన వెంటనే డెలివరీ రైడర్ తన బైక్‌పై పేర్కొన్న లొకేషన్‌కు చేరుకున్నాడు. అయితే అక్కడ అతను చూసింది సాధారణ ఇల్లు కాదు… ఒక గ్రేవ్‌యార్డ్ (స్మశానం) కావడం గమనార్హం.
గ్రేవ్‌యార్డ్ గేట్ వద్ద నిలిచిన రైడర్.. వెంటనే కస్టమర్‌కు ఫోన్ చేసి.. ‘మేడమ్, నేను మీరు ఇచ్చిన లొకేషన్‌కి వచ్చాను… ఇది సమాధి స్థలం కదా?’ అని అడిగాడు. అదే సమయంలో, కస్టమర్ అతనికి లోపలికి రావాలని చెప్పిందని రైడర్ వీడియోలో వెల్లడించాడు.
రాత్రి సమయం కావడంతో పాటు, పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో రైడర్ భయపడిపోయాడు. గ్రేవ్‌యార్డ్ లోపలికి వెళ్లేందుకు అతను స్పష్టంగా నిరాకరించాడు. చివరకు గేట్ దగ్గరే ఆర్డర్‌ను అందజేసినట్లు సమాచారం.
ఈ మొత్తం ఘటనను రైడర్ తన మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘ఇలాంటి లొకేషన్‌లో ఆర్డర్ చేయడం సరైనదేనా?’ “డెలివరీ రైడర్ల భద్రతను కూడా కంపెనీలు పరిగణలోకి తీసుకోవాలి” అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది ఈ ఘటనను సరదాగా తీసుకుంటే.. మరికొందరు మాత్రం ఇది నిజంగా భయంకరమైన అనుభవమని అభిప్రాయపడుతున్నారు. రాత్రి వేళల్లో ఇలాంటి ప్రాంతాలకు డెలివరీ చేయడం రైడర్లకు ప్రమాదకరమని పలువురు వ్యాఖ్యానించారు.
ఈ సంఘటన డెలివరీ రైడర్లు రోజూ ఎదుర్కొనే సవాళ్లను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. భద్రత పరంగా ఇలాంటి లొకేషన్లపై ఫుడ్ డెలివరీ యాప్‌లు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని నెటిజన్లు సూచిస్తున్నారు.