
అరటిపండు తొక్కపై కాలు వేయడం.. జారి కింద పడటం.. ఇది సినిమాల్లో చూసే కామెడీ సీన్ మాత్రమే కాదు, నిజ జీవితంలో జరిగే ఒక ఫిజికల్ రియాక్షన్. అయితే ఆపిల్ లేదా నారింజ తొక్కలపై వేస్తే లేని ప్రమాదం, కేవలం అరటి తొక్కపై వేసినప్పుడే ఎందుకు వస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక ఉన్న అసలు కారణాలను జపాన్ శాస్త్రవేత్తలు పరిశోధించి మరీ కనిపెట్టారు. జపాన్‌లోని కితాసాటో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం.. అరటిపండు తొక్క లోపలి భాగంలో పాలిశాకరైడ్ జెల్ అనే పదార్థంతో నిండిన అతి చిన్న సంచులు ఉంటాయి. మనం తొక్కపై అడుగు పెట్టగానే మన శరీర బరువుకు ఆ సంచులు పగిలిపోయి, ఆ జెల్ బయటకు విడుదలవుతుంది. ఈ జెల్ నీరు, చక్కెరలు, ప్రోటీన్ల మిశ్రమం. ఇది షూకి మరియు నేలకి మధ్య ఒక బలమైన నేచురల్ లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది.
సాధారణంగా గరుకుగా ఉండే రోడ్లపై నడిచేటప్పుడు ఘర్షణ ఎక్కువగా ఉండి మనం పడిపోకుండా ఉంటాం. కానీ శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం అరటిపండు తొక్క యొక్క ఘర్షణ గుణకం కేవలం 0.07 మాత్రమే.. ఇది మంచు మీద నడిచేటప్పుడు ఉండే ఘర్షణ కంటే తక్కువ. అంటే మంచు మీద కంటే అరటిపండు తొక్కపై జారి పడే అవకాశాలు చాలా ఎక్కువ అన్నమాట.
మనం తొక్కపై కాలు వేయగానే ఆ జెల్ వల్ల పాదం ఊహించని వేగంతో ముందుకు కదులుతుంది. మన శరీరం యొక్క గురుత్వాకర్షణ కేంద్రం పాదాల పరిధి దాటి పోవడంతో మెదడు ఆ మార్పును గ్రహించి బ్యాలెన్స్ చేసేలోపే మనం పట్టు కోల్పోయి కింద పడిపోతాము.
ఆపిల్, నారింజ వంటి ఇతర పండ్ల తొక్కల్లో తేమ ఉన్నప్పటికీ, వాటిలో ఈ ప్రత్యేకమైన పాలిశాకరైడ్ జెల్ ఉండదు. అందుకే అవి అరటిపండు తొక్కలా అంత వేగంగా జారవు. ఈ అద్భుతమైన పరిశోధన చేసినందుకు గాను శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మకమైన ఇగ్ నోబెల్ బహుమతి కూడా లభించింది. అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, కానీ దాని తొక్క మాత్రం ఇతరుల ఎముకలు విరగడానికి కారణం కావచ్చు. కాబట్టి అరటిపండు తిన్న తర్వాత తొక్కను ఎప్పుడూ డస్ట్‌బిన్‌లోనే వేయండి..