రైల్వే ట్రాక్‌ మధ్యలో కంకర ఎందుకు ఉంటుందో తెలుసా? ఈ ఇంజినీరింగ్ సీక్రెట్ తెలిస్తే అవాక్కే..

రైల్వే ట్రాక్‌లపై పారేసినట్లు కనిపించే ఈ కంకర రాళ్లను కేవలం టైంపాస్ కోసం వేయలేదు. భారీ బరువుతో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైలు ప్రయాణాన్ని అత్యంత సురక్షితంగా మార్చే ఒక షాకింగ్ ఇంజనీరింగ్ సీక్రెట్ ఈ చిన్న రాళ్ల వెనుక దాగి ఉంది. దీన్ని గురించి చాలా మందికి తెలియవు.

రైల్వే ట్రాక్‌ మధ్యలో కంకర ఎందుకు ఉంటుందో తెలుసా? ఈ ఇంజినీరింగ్ సీక్రెట్ తెలిస్తే అవాక్కే..
Why Are There Stones On Railway Tracks

Updated on: Jun 20, 2026 | 4:37 PM

మన దేశంలో రైళ్లు ప్రతిరోజూ లక్షలాది మందిని తమ గమ్యస్థానాలకు చేర్చుతాయి. రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా రైల్వే స్టేషన్లలో నిలబడినప్పుడు పట్టాల కింద, ఇరుపక్కలా చిన్న చిన్న కంకర రాళ్లు కుప్పలుగా పోసి ఉండటాన్ని మనమందరం చూసే ఉంటాం. చాలా మంది ఇవి కేవలం దుమ్ము లేవకుండా ఉండటానికో లేదా పట్టాల కింద పోసిన సాధారణ రాళ్లో అనుకుంటారు. కానీ ఒక సాధారణ రైలు వందల నుండి వేల టన్నుల బరువు ఉంటుంది. అంతటి భారీ భారంతో గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లే రైలు ప్రయాణాన్ని అత్యంత సురక్షితంగా మార్చే అద్భుతమైన ఇంజినీరింగ్ రహస్యం ఈ రాళ్ల వెనుక దాగి ఉంది. రైల్వే సాంకేతిక పరిభాషలో ఈ కంకర రాళ్లను ట్రాక్ బ్యాలస్ట్ అని పిలుస్తారు. సాధారణంగా ఒక రైలు ఇంజన్, దాని వెనుక ఉండే కోచ్‌ల బరువు కలిపితే వందల టన్నులు ఉంటుంది. రైలు పట్టాలపై నుండి వెళ్లేటప్పుడు ఆ భారీ ఒత్తిడి మొత్తం కేవలం ఆ రెండు ఇనుప పట్టీలపైనే పడుతుంది. ఆ ఒత్తిడి నేరుగా భూమిపై పడితే, నేల కుంగిపోవడం లేదా పట్టాలు పూర్తిగా వంగిపోవడం జరుగుతుంది. పట్టాల కింద నిలువుగా ఉండే చెక్క లేదా కాంక్రీట్ దిమ్మెలను స్లీపర్స్ అంటారు. ఈ స్లీపర్స్ కింద ఉండే కంకర రాళ్లు, రైలు సృష్టించే ఆ భారీ బరువు, ఒత్తిడిని కేవలం ఒకే చోట పడకుండా, ట్రాక్ మొత్తం సమానంగా పంపిణీ చేసి భూమికి అందిస్తాయి. దీనివల్ల ఎంతటి భారీ గూడ్స్ రైలు వెళ్లినా ట్రాక్ స్థిరంగా ఉంటుంది.

పట్టాలు జరగకుండా నిరోధించడం

రైళ్లు వాటిపై నుండి అత్యంత వేగంతో వెళ్లినప్పుడు తీవ్రమైన కంపనాలు, శబ్దం వస్తాయి. రైలు వెళ్లే వేగానికి, ఆ వైబ్రేషన్స్ కారణంగా పట్టాలు ఇటు అటు కదలిపోయే ప్రమాదం ఉంది. అలా కదలకుండా, పట్టాలను పట్టి ఉంచే కాంక్రీట్ స్లీపర్స్ జరిగిపోకుండా ఈ రాళ్లు ఇరుపక్కలా గట్టిగా నొక్కి పట్టి ఉంచుతాయి. ఈ కంకర రాళ్లు ఒక బలమైన పునాదిలా పనిచేస్తాయి. ఒకవేళ ఇక్కడ రాళ్లు లేకపోతే, రైలు వెళ్లే వేగానికి పట్టాల మధ్య దూరం మారిపోయి లేదా పట్టాలు పక్కకు జరిగిపోయి భారీ రైలు ప్రమాదాలు జరుగుతాయి. అదేవిధంగా ఎక్కువ ఎండలకు ఇనుము వ్యాకోచిస్తుంది. చలికి ఇనుము సంకోచిస్తుంది. అటువంటి సమయాల్లో పట్టాలు శాశ్వతంగా దెబ్బతినకుండా, వాటి స్థానం నుండి జరగకుండా నిరోధించడానికి ఈ రాళ్లు ఒక కుషన్ లాగా, స్ప్రింగ్ లాగా పనిచేస్తూ సహాయపడతాయి. ఇవి పట్టాల మధ్య ఉండే ఒత్తిడిని నియంత్రిస్తాయి.

పదునైన రాళ్లనే ఎందుకు వాడతారు?

రైల్వే ట్రాక్‌లపై వాడే రాళ్లు నదుల్లో లేదా చెరువుల్లో దొరికే గుండ్రని, నునుపైన రాళ్లలా ఉండవు. ఇవి చాలా పదునుగా, పగిలిన కోణాల రూపంలో ఉంటాయి. దీని వెనుక ఒక బలమైన ఇంజనీరింగ్ కారణం ఉంది. ఒకవేళ ట్రాక్‌పై గుండ్రని రాళ్లు వేస్తే, రైలు వెళ్లేటప్పుడు వచ్చే ఒత్తిడికి అవి ఒకదానిపై ఒకటి జారిపోయి పక్కకు తప్పుకుంటాయి. అదే పదునైన కంకర రాళ్లు అయితే ఒకదానికొకటి ఇంటర్‌లాక్ అయిపోతాయి. అంటే ఒక రాతి పదునైన కోణం మరో రాతితో గట్టిగా ముడుచుకుపోతుంది. దీనివల్ల రైలు ఎంత వేగంతో వెళ్లినా ఆ రాళ్లు అస్సలు కదలవు.

అద్భుతమైన సహజ డ్రైనేజీ వ్యవస్థ

వర్షాకాలంలో రైల్వే ట్రాక్‌లపై నీరు నిలిచిపోతే కింద ఉన్న మట్టి లూజ్ అయిపోతుంది. మట్టి బలహీనపడితే రైలు వెళ్లేటప్పుడు పట్టాలు కుంగిపోతాయి. కానీ ఈ కంకర రాళ్ల నిర్మాణం వల్ల వర్షం ఎంత దంచికొట్టినా, ఆ నీరు ఏమాత్రం ట్రాక్‌పై ఆగకుండా వెంటనే రాళ్ల సందుల గుండా కిందకి ప్రవహించి పక్కకు వెళ్లిపోతుంది. దీనివల్ల ట్రాక్ ఎప్పుడూ పొడిగా, బలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాళ్ల వల్ల ట్రాక్‌ల మధ్య ఎలాంటి మొక్కలు పెరగవు.

పట్టాల కింద ఈ రాళ్లు లేకపోతే ఏం జరుగుతుంది?

ప్రస్తుతం కొన్ని మెట్రో రైలు మార్గాల్లో లేదా ఆధునిక బ్రిడ్జిలపై రాళ్లు లేని ట్రాక్‌లను మనం చూస్తున్నాం. కానీ అక్కడ రాళ్లకు బదులుగా భారీ కాంక్రీట్ బెడ్‌లను నిర్మిస్తారు, అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. సాధారణ రైల్వే లైన్లలో కంకర రాళ్లు లేకపోతే.. కేవలం కొద్దిరోజుల్లోనే రైళ్ల బరువుకు పట్టాలు భూమిలోకి కుంగిపోతాయి, కలుపు మొక్కలతో ట్రాక్ నిండిపోతుంది. వర్షం వస్తే బురదమయంగా మారి రైల్వే వ్యవస్థే పూర్తిగా స్తంభించిపోతుంది.

Follow Us