ప్రపంచంలోని ప్రేమికులందరూ వాలెంటైన్స్ డేను ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. మిగతా రోజుల్లో ప్రేమించుకోరా అంటే … కుంటారు కానీ ప్రేమికుల రోజున ఓ పిసరంత ఎక్కువగా ప్రేమించుకుంటారు. ఆ రోజును ఎలా సెలబ్రేట్ చేసుకోవాలన్నదానిపై నెల రోజుల ముందు నుంచే ప్లానేసుకుంటారు. అసలు ప్రేమంటే ఏమిటి.? ప్రేమ సాంద్రతను ఎలా కొలవడం..? అంటే చెప్పడం కష్టమే కానీ.. కొన్ని కొన్ని సంఘటనలు.. సందర్భాలు. నిర్మాణాలను చూసి ప్రేమను బేరీజు వేసుకోవచ్చు.
చితినైనా చిగురించేది- మృతినైనా బతికించేది ప్రేమ అని అన్నారు వేటూరి.. ముంతాజ్ మీద అంతేసి ప్రేమ ఉన్నా ఆమెను బతికించుకోలేకపోయాడు షాజహాన్. తన ముద్దుల భార్య మరణాన్ని తట్టుకోలేకపోయాడు . ఆమెపై తనకు ఎంత ప్రేముందో చాటిచెప్పాలనుకున్నాడు. తాజ్‌మహల్‌ను నిర్మించాడు. ఆయన చక్రవర్తి కాబట్టి కట్టగలిగాడు. మరి సామాన్యుల మాటో! పేదరికానికి ప్రేమ ఉండకూడదా? ఆ ప్రేమను మందిరంగా మలచకూడదా…? ప్రేమకు ప్రతిరూపం తాజ్‌మహల్. కనుమూసిన తన భార్య ముంతాజ్ మీదున్న అపారమైన ప్రేమకు గురుతుగా షాజహాన్ చక్రవర్తి కట్టిన ప్రేమాకృతి ఇది! చక్రవర్తి కాబట్టి అలా అనుకున్నాడు ఇలా కట్టేశాడు.. మరి మామూలు వాళ్లకి అయ్యేపనేనా! అయినా డబ్బున్నవాళ్లకేనా ప్రేమ ఉండేది.. ఏం కలిమి లేని వాళ్లకు ప్రేమ ఉండదా..? ప్రేమకు పేదరికం ఉంటుందా..? ఎందుకుండదు..? కాకపోతే ఆ ప్రేమను బయటకు చెప్పుకోలేరు.. సామాన్యుల్లోనూ భార్యపైనో… ప్రియురాలిపైనో అవాజ్యమైన ప్రేమను కురిపించేవారున్నారు. ఇలాంటి వారిలో ఫైజుల్ హసన్ ఖాద్రీ ఒకరు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాకు చెందిన ఫైజుల్ హసన్ ఖాద్రీకి తన భార్య తాజ్‌ములీ అంటే అమితమైన ప్రేమ! 1953లో వీరిద్దరు ఒక్కటయ్యారు.. పెళ్లప్పుడు ఖాద్రీ వయసు 17 ఏళ్లు.. తాజ్‌ములీకి 14 ఏళ్లు.. పిల్లలు లేరన్న బాధ తప్పితే వారి వైవాహిక జీవితం ఆనందమయంగానే సాగింది..తాజ్‌ములీ చుట్టుపక్కలవారిని ప్రేమగా పలకరించేది.. చిన్నారులందరినీ తన పిల్లలుగానే భావించేది.. పెళ్లికి ముందు పెద్దగా చదువుకోకపోయినా ఆమెకు పట్టుబట్టి ఉర్దూ నేర్పించాడు ఖాద్రీ.. ఇద్దరూ కలిసి ఓసారి ఆగ్రాకు వెళ్లి తాజ్‌మహల్‌ను చూశారు. ప్రేమకు నిలువెత్తు ప్రతిరూపమైన ఆ తాజ్‌మహల్‌ను చూసి మురిసిపోయింది తాజ్‌ములీ.. చనిపోయిన తర్వాత మనల్ని ఎవరైనా గుర్తుంచుకుంటారా అన్న సందేహం ఆమెకు కలిగింది. ఇంటికొచ్చాక అదే ప్రశ్నను భర్తకు వేసింది. ‘నా కంటే ముందు మరణం నిన్ను వరించి వస్తే మాత్రం నిన్ను అందరూ గుర్తుంచుకునేలా చేస్తాను’ అని ప్రమాణం చేశాడు. వారి ఆనందాన్ని చూసి విధికి కన్ను కుట్టింది. తాజ్‌ములీకి గొంతు క్యాన్సర్ వచ్చింది. తనకు వచ్చిన జబ్బు క్యాన్సర్ అన్న విషయం ఆమెకు తెలియదు. స్థానిక వైద్యులు కూడా గుర్తించలేకపోయారు. కొన్నాళ్ల తర్వాత పెద్ద డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లాడు ఖాద్రీ.. అప్పటికే ఆలస్యమయ్యిందన్న పిడుగులాంటి వార్త చెప్పారు డాక్టర్లు.. 2011 డిసెంబర్‌లో తాజ్‌ములీ కన్నుమూసింది. తాజ్‌మహల్ ఎదుట తన భార్యకు ఇచ్చిన మాట ఖాద్రీకి గుర్తుకొచ్చింది. తాజ్‌మహల్‌లాగే ఓ చిరస్మరణీయ నిర్మాణానికి పూనుకున్నాడు..
మూడేళ్లు విపరీతంగా కష్టపడ్డాడు. తన గ్రామం కాసర్ కలన్‌లో తాజ్‌మహల్ ప్రతీకను నిర్మించాడు.. ఈ కట్టడానికి అస్గర్ అని పేరు పెట్టాడు. ఇందుకోసం తనకున్న కొద్ది పాటి పొలాన్ని అమ్మేశాడు. భార్య బంగారు నగలు, ఇంట్లోని వెండి సామాను అంతా అమ్మేశాడు. పొలం అమ్మగా ఆరు లక్షలు వచ్చాయి.. బంగారం, ఇతర వస్తువులకు లక్షన్నర వచ్చాయి.. ఆ సొమ్ముతోనే నిర్మాణాన్ని మొదలు పెట్టాడు.. తాజ్‌మహల్‌లాగే నాలుగువైపులా ఎత్తయిన మినార్లు నిర్మించాడు.. ఒక్కో మినార్ ఎత్తు 25 అడుగులు.. చుట్టూ మొక్కలు నాటాడు. తన భార్య జ్ఞాపకార్థం నిర్మించుకున్న ఆ సౌధం ముందు ఓ చిన్న తటాకాన్ని ఏర్పాటు చేశాడు. పోస్ట్‌మాస్టర్‌గా పని చేసి పదవీవిరమణ చేసిన ఖాద్రీ పెన్షన్ సొమ్ము తప్ప మిగిలినదంతా ఈ ప్రేమభవంతికే ఖర్చు పెట్టాడు.. చనిపోయేలోపు నిర్మాణానికి పాలరాతి తాపడం చేయాలన్నది ఖాద్రీ కోరిక.. అందుకు మరో ఏడెనిమిది లక్షలు పట్టవచ్చు. ఖాద్రీ మనోవాంఛను గుర్తించిన చుట్టుపక్కల వాళ్లు ఆర్ధిక సాయం అందించడానికి ముందుకొచ్చారు.. భార్య మీద ప్రేమతో చేస్తున్న ఈ పని తన చేతుల మీదుగానే సాగాలన్నది ఖాద్రీ అభిమతం. అందుకే ఎవరు ఏమిచ్చానా తీసుకోలేదు. అఖిలేశ్‌యాదవ్ కూడా తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖాద్రీని లక్నోకు పిలిపించుకుని ధన సాయం చేస్తానన్నారట! ఖాద్రీ మాత్రం మర్యాదపూర్వకంగా తిరస్కరించాడు.. పైగా తన గ్రామంలోని స్కూల్‌ను ఎడ్యుకేషన్ బోర్డు గుర్తించేలా సాయం చేయండి చాలంటూ కోరాడు.. తను చనిపోయాక తాజుముల్లీ సమాధి పక్కనే తననూ సమాధి చేయాలన్నది ఖాద్రీ కోరిక. ఇప్పుడీ మినీ తాజ్‌మహల్ టూరిస్టు కేంద్రంగా మారింది.. జిల్లా ప్రజలే కాదు.. విదేశీ పర్యాటకులు కూడా వస్తున్నారు. ధవళకాంతుల్లో మెరిసిపోయే తాజ్‌మహల్ అంత అందంగా లేకపోయినా పర్యాటకులు మాత్రం ఖాద్రీ ప్రేమచిహ్నాన్ని చూసి మురిసిపోతున్నారు.. భార్య పట్ల ఖాద్రీకున్న ప్రేమే ఈ కట్టడానికి శోభనందిస్తోందన్నది పర్యాటకుల భావన! అస్గర్‌కు సమీపంలోనే ఓ చిన్ని ఇంట్లో ఉంటున్న ఖాద్రీ ఎక్కువ సమయాన్ని ఈ ప్రేమమందిరంలోనే గడుపుతున్నారు. ఇప్పుడు చెప్పండి…ప్రేమను వ్యక్తపరచడానికి పాతరాతి మందిరాలే కావాలా..?