అసలే వర్షాకాలం..హఠాత్తుగా నాగుపాము ఎదురైతే ఏం చేయాలి? ప్రాణాలు కాపాడే సేఫ్టీ టిప్స్, ప్రథమ చికిత్స గైడ్!

భారతదేశంలో కనిపించే అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన పాములలో నాగుపాము (Cobra) ఒకటి. సాధారణంగా పాములు మనుషులను చూసి పారిపోవడానికే ప్రయత్నిస్తాయి. కానీ, వాటికి ముప్పు పొంచి ఉందని భావిస్తేనే దాడి చేస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఇళ్ల పరిసరాల్లో పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. మరి అకస్మాత్తుగా నాగుపాము మనకు ఎదురైతే ప్రాణాపాయం నుండి ఎలా తప్పించుకోవాలి? ఒకవేళ పాము కాటు వేస్తే ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

అసలే వర్షాకాలం..హఠాత్తుగా నాగుపాము ఎదురైతే ఏం చేయాలి? ప్రాణాలు కాపాడే సేఫ్టీ టిప్స్, ప్రథమ చికిత్స గైడ్!
Monsoon Snake Safety
Image Credit source: Tv9 marathi

Updated on: Jul 05, 2026 | 1:47 PM

పాములంటే అందరికీ హడలే.. ఎక్కడో పాము ఉందని తెలిస్తే ప్రాణ భయంతో పరుగులు తీస్తారు చాలా మంది. అలాంటిది రాజనాగు, నాగుపాములంటే ఇక అంతే సంగతి..!అసలే వర్షాకాలం. భారీ వర్షాలు, వరదలకు చెట్లు, పొదల్లోని పాములు బయటకు వస్తుంటాయి. వెచ్చని ప్రదేశాలను వెత్తుక్కుంటూ జనావాసాల్లోకి వస్తుంటాయి. అలా హఠాత్తుగా నాగుపాము (Cobra) ఎదురైతే ఏం చేయాలి..? పాము కాటుకు గురైనప్పుడు ఎలాంటి ప్రథమ చికిత్సలు అవసరం అనే వివరాలు ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకుని ఉండాలి..

నాగుపాము ఎదురైనప్పుడు చేయాల్సినవి:

కదలకుండా ప్రశాంతంగా ఉండండి: పామును చూసిన వెంటనే భయంతో కేకలు వేయడం లేదా హడావుడి చేయడం అస్సలు వద్దు. మీరు కదలకుండా స్థిరంగా ఉంటే, పాము మిమ్మల్ని ముప్పుగా భావించదు.

కళ్లలోకి నేరుగా చూడకండి: పాము కళ్లలోకి నేరుగా చూడటం వల్ల అది మిమ్మల్ని శత్రువుగా భావించి దాడికి దిగే ప్రమాదం ఉంది. చూపును పక్కకు తిప్పి, నెమ్మదిగా వెనక్కి జరగండి.

ఇవి కూడా చదవండి

సురక్షిత దూరం పాటించండి: నాగుపాము తన శరీర పొడవులో మూడింట ఒక వంతు దూరం నుండి అత్యంత వేగంగా దాడి చేయగలదు. అందువల్ల దానికి కనీసం 6 నుండి 8 అడుగుల దూరంలో ఉండటం సురక్షితం.

దానికి దారి ఇవ్వండి: పాము పారిపోవడానికి తగిన మార్గాన్ని వదిలేయండి. ఏమాత్రం అవకాశం ఉన్నా అది అక్కడి నుండి వెళ్ళిపోవడానికే చూస్తుంది.

పాము కాటు వేస్తే చేయాల్సిన ప్రథమ చికిత్స:

ఆందోళన పడకండి (Stay Calm): అత్యంత ముఖ్యం. పాము కరిచిన వ్యక్తి తీవ్రమైన భయాందోళనకు గురికాకూడదు. భయపడటం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరిగి, విషం రక్తంలో చాలా వేగంగా శరీరమంతటా వ్యాపిస్తుంది.

బాధిత భాగాన్ని స్థిరంగా ఉంచడం: కదలికలు తగ్గించండి. పాము కాటు వేసిన చేతిని లేదా కాలును అస్సలు కదిలించకూడదు. వీలైతే ఆ భాగాన్ని గుండె మట్టం కంటే క్రిందికి ఉంచాలి. చేతికి ఉన్న గాజులు, ఉంగరాలు, బిగుతుగా ఉన్న దుస్తులను వెంటనే తొలగించాలి.

అపోహలకు దూరంగా ఉండటం: చేయకూడని పనులు. సినిమాల్లో చూపించినట్లుగా నోటితో విషాన్ని పీల్చే ప్రయత్నం అస్సలు చేయవద్దు. గాయంపై బ్లేడ్‌తో కోయడం, గట్టిగా కట్టు (Tourniquet) కట్టడం, లేదా ఐస్ ముక్కలు పెట్టడం వంటివి చేయకూడదు. ఇవి ఇన్ఫెక్షన్‌ను మరింత పెంచుతాయి.

ఆసుపత్రికి తరలించడం: తక్షణ నిర్ణయం. ఎలాంటి నాటు వైద్యాలు, మంత్రాల జోలికి వెళ్లకుండా.. బాధితుడిని తక్షణమే ప్రభుత్వ లేదా యాంటీవీనమ్ (Antivenom) ఇంజెక్షన్లు అందుబాటులో ఉండే పెద్ద ఆసుపత్రికి తరలించాలి. పాము కాటుకు గురైనప్పుడు సమయం చాలా విలువైనది. సరైన అవగాహన, సమయస్ఫూర్తి, సకాలంలో అందించే వైద్య సహాయం మాత్రమే బాధితుడి ప్రాణాలను కాపాడగలవు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా ముందుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us