ఓ వ్యక్తి తన ఇంటి పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తుండగా.. ఏవో వింత శబ్దాలు విన్నాడు. మొదటిగా వాటిని అతడు పెద్దగా పట్టించుకోలేదు. అయితే అవి క్రమేపీ ఇంకా ఎక్కువగా వస్తుండటంతో.. ఎక్కడ నుంచి వస్తున్నాయో.. అసలేంటో అది చూసేందుకు ఆ ప్రాంతమంతా కలియతిరిగాడు.. అంతే! ఎదురుగా కనిపించిన సీన్ చూసి.. దెబ్బకు అతడి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇంతకీ అసలేం జరిగిందంటే.?
వివరాల్లోకి వెళ్తే.. ఛతీస్‌గడ్‌లోని కోర్బాలో ఓ భారీ కింగ్ కోబ్రా కలకలం రేపింది. పవన్‌ఖేట్ గ్రామంలోని ఓ వ్యక్తి ఇంటి పెరట్లో సుమారు 11 అడుగుల పొడవున్న భారీ కింగ్ కోబ్రా కనిపించింది. దీంతో ఒక్కసారిగా స్థానికులు భయబ్రాంతులకు లోనయ్యారు. సదరు ఇంటి యజమాని ఆ విషసర్పాన్ని చూసిన వెంటనే అప్రమత్తం కావడంతో.. పాము కాటు నుంచి తప్పించుకోగలిగాడు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించాడు. ఇక ఘటనాస్థలికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు చాకచక్యంగా కింగ్ కోబ్రాను పట్టుకుని బంధించారు. అనంతరం సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి విడిచిపెట్టాడు. దీంతో గ్రామస్థులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటన ఏప్రిల్ 1(శనివారం) ఉదయం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, కింగ్ కోబ్రాలు సుమారు 20 నుంచి 21 అడుగుల పొడవు ఉంటాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఇవి చాలా వరకు ఆగ్నేయాసియా, లోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తాయట. అలాగే ఈ పాము ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ఒకటి.