
ఇటీవల కాలంలో సోషల్ మీడియా అనేది అనామకులను సెలబ్రిటీలను చేసేస్తోంది. ఆకట్టుకునేలా ఉండే ఫొటో లేదా వీడియో ఒక్కటి వైరల్ అయ్యిందంటే చాలా.. ఒక్క రాత్రిలో ఫేమస్ అయిపోతున్నారు. ఈ ఏడాదిలో అలాంటి విషయాలు ఎన్నో జరిగాయి. తాజాగా, ఓ యువతి చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ సూపర్ డ్యాన్స్ చేసిన ‘ధూమ్ మచాలే’ పాటకు ఆమె నృత్యం చేసింది. ఆమె కూడా హృతిక్ రేంజ్‌లో డ్యాన్స్ చేసిందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ వైరల్ వీడియోలో ఆ యువతి అందమైన ఎరుపు రంగు చీర, హైహీల్స్ ధరించి డ్యాన్స్ చేయడం విశేషం. చీర, హైహీల్స్ వేసుకుని వేగంగా నడవడమే కష్టం కానీ.. ఈమె మాత్రం క్లిష్టమైన డ్యాన్స్ స్టెప్పులను అవలీలగా చేసేసింది. దీంతో ఆమె డాన్స్‌ను ధూమ్ పాట చీర వెర్షన్ ఇదేనంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
అతిథిగా వెళ్లి.. అదరగొట్టింది
ఈ డ్యాన్స్ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో ఐలి ఘియా అనే యువతి షేర్ చేస్తూ.. ‘ప్రేక్షకులు ఇంత గొప్పగా ఉంటే.. డ్యాన్స్ తప్పనిసరి’ అంటూ క్యాప్షన్ పెట్టింది. తాను అక్కడికి అతిథిగా వెళ్లానని.. కానీ అక్కడి ప్రేక్షకులు తనను డ్యాన్స్ చేయాలని కోరడంతో సవాలుగా తీసుకుని చేసినట్లు తెలిపింది. తనకు ఇష్టమైన పాటకు డ్యాన్స్ చేసి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నట్లు చెప్పుకొచ్చింది.
ఈ వైరల్ వీడియోకు ఇప్పటి వరకు 4.5 మిలియన్లకుపైగా వ్యూస్ రాగా, 52,000 మంది నెటిజన్లు లైక్స్ కొట్టారు. చీరతోపాటు హైహీల్స్ ధరించి హృతిక్ పాటకు డ్యాన్స్ చేయడం అంత మామూలు విషయం కాదని.. కానీ ఈ అమ్మాయి అదరగొట్టిందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.