
ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్ రిజిస్ట్రీ ఆఫీసు ఆవరణలో ఒక వింత ఘటన వెలుగుచూసింది. ఒక కోతి హఠాత్తుగా వచ్చి ఓ వ్యక్తి చేతిలోని బ్యాగును లాక్కొని చకచకా చెట్టుపైకి ఎక్కేసింది. ఆ బ్యాగులో ఏకంగా రెండు లక్షల రూపాయల నగదు ఉంది. చెట్టుపై కూర్చున్న ఆ కోతి బ్యాగును తెరిచి, అందులోని వంద, ఐదు వందల నోట్ల కట్టలను గాల్లోకి విసిరేయడం ప్రారంభించింది. నోట్ల వర్షం కురుస్తున్నట్లుగా డబ్బులు కింద పడుతుంటే, అక్కడ ఉన్న జనం ఆ నోట్లను ఏరుకోవడానికి పరుగులు తీశారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవ్వగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బులంద్‌షహర్ నగరంలోని సదర్ రిజిస్ట్రీ ఆఫీస్ ఆవరణలోకి ఒక వ్యక్తి ఆస్తి రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం భారీ నగదుతో వచ్చాడు. అతను తన చేతిలో రూ. 2 లక్షల క్యాష్ ఉన్న బ్యాగును పట్టుకుని నడుచుకుంటూ వెళ్తుండగా, అక్కడ పొంచి ఉన్న ఒక కోతి హఠాత్తుగా అతనిపైకి దూకింది. ఆ వ్యక్తి కోలుకునే లోపే అతని చేతిలోని డబ్బుల బ్యాగును లాక్కొని, క్షణాల వ్యవధిలో పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టుపైకి ఎక్కేసింది.
తన కళ్ల ముందే రూ. 2 లక్షల నగదు కోతి పరంపరం అవ్వడంతో ఆ బాధితుడు లబోదిబోమంటూ గట్టిగా కేకలు వేశాడు. అతని అరుపులు విని చుట్టుపక్కల ఉన్న జనం, లాయర్లు అక్కడికి చేరుకున్నారు. అంతా కలిసి కోతిని కిందకు దించడానికి ప్రయత్నిస్తుండగా.. ఆ కోతి బ్యాగు జిప్ తీసి లోపల ఉన్న నోట్ల కట్టలను బయటకు తీసింది. అది తినే వస్తువు కాదని గ్రహించిందో ఏమో కానీ, నోట్ల కట్టలను ఒక్కొక్కటిగా విప్పి గాల్లోకి విసరడం ప్రారంభించింది.
వంద రూపాయలు, ఐదు వందల రూపాయల నోట్లు చెట్టుపై నుండి కురుస్తున్న వర్షంలా కింద పడటాన్ని చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. కొందరు ఆ నోట్లను పట్టుకోవడానికి, కింద పడిన వాటిని ఏరుకోవడానికి పోటీ పడ్డారు. ఈ గందరగోళం మధ్య బాధితుడు, కొంతమంది మంచి వ్యక్తులు కలిసి కోతి విసిరేసిన నోట్లను ఎంతో కష్టపడి తిరిగి సేకరించారు.
వీడియో ఇక్కడ చూడండి..
उत्तर प्रदेश के बुलंदशहर का एक वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है. जिसमें एक बंदर पेड़ पर चढ़कर पैसों की बरसात करता नजर आ रहा है.असल में एक व्यक्ति जमीन से जुड़े कागजी काम पूरे करने के लिए एक वकील के चैंबर में आया था. उसके पास करीब 2 लाख रुपये नकद से भरा एक बैग था. इसी दौरान… pic.twitter.com/JaZKWlWmgR
— NDTV India (@ndtvindia) June 1, 2026
రిజిస్ట్రీ ఆఫీసు పరిసరాల్లో ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. కోతి బ్యాగు లాక్కెళ్లడం, చెట్టుపై నుండి నోట్లను విసిరేయడం, జనం వాటి వెనుక పరుగులు తీయడం వంటి విజువల్స్ నెట్టింట విపరీతమైన లైకులు, కామెంట్లతో దూసుకుపోతున్నాయి. ఈ కోతికి బ్యాంక్ అకౌంట్ లేనట్టుంది, అందుకే అందరికీ పంచేస్తోంది అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అదృష్టవశాత్తూ బాధితుడికి చాలా వరకు డబ్బులు తిరిగి దక్కడంతో అతను ఊపిరి పీల్చుకున్నాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..