
ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఒక అద్భుతమైన ఘనతని సాధించింది మంగళూరు స్టూడెంట్. సెయింట్ అలోసియస్ లో బి.ఎ. లాస్ట్ ఇయర్ చదువుతున్న రెమోనా ఎవెట్ పెరీరా శాస్త్రీయ నృత్యమైన భరతనాట్యాన్ని సుదీర్ఘంగా ప్రదర్శించింది. గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. రెమోనా 170 గంటల పాటు భరతనాట్యాన్ని అసాధారణ రీతిలో ప్రదర్శించింది. జూలై 21న ప్రారంభించిన ఈ ప్రదర్శన ఒక వారం తర్వాత అంటే జూలై 28న ముగిసింది. రెమోనా నాట్య ప్రదర్శన చూసిన ఆహుతులు, అతిధులు హర్షధ్వానాలతో చప్పట్లు కొట్టారు. రెమోనా ప్రతిభకు ప్రసంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచంలోనే ఇంత సుదీర్ఘకాలం భరతనాట్యం ప్రదర్శించిన మొదటి వ్యక్తిగా రెమోనా నిలిచింది.
రెమోనా ప్రదర్శనపై యూనివర్సిటీలోని రంగ అధ్యయన కేంద్రం డైరెక్టర్ క్రిస్టోఫర్ డిసౌజా మాట్లాడుతూ.. ప్రతి మూడు గంటలకు ఒకసారి 15 నిమిషాలు మాత్రమే విరామం తీసుకుందని.. అయినా తనలో శక్తి తగ్గలేదని.. స్పూర్తి కొనసాగిందని చెప్పారు. అయితే 120 గంటల పాటు భారతనాట్యం చేసిన తర్వాత ప్రపంచ రికార్డ్ నెలకొల్పినట్లు గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు భారత ప్రతినిధి డాక్టర్ మనీష్ విష్ణోయ్ చెప్పారు. అయితే రెమోనా తాను ఏడు రోజులు డ్యాన్స్ చేస్తానని పట్టుబట్టింది. అది అరుదైన సంకల్పమని చెప్పారు.
రెమోనా భరతనాట్య ప్రయాణం ఆమె మూడేళ్ల వయసు నుంచి మొదలైంది. శ్రీవిద్య మురళీధర్ ఆధ్వర్యంలో భరతనాట్యం అభ్యాసానికి శ్రీకారం చుట్టింది. 2019లో ఆరంగ్రేటం చేసింది. ఇది ఆమె మొదటి ప్రధాన సోలో ప్రదర్శన. ఇప్పుడు ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది.
ఏడు రోజుల పాటు సాగిన ఈ నాట్య ప్రదర్శనని చూసేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు మాత్రమే కాదు రాజకీయ ప్రముఖులు, కళాభిమానులు, ప్రజలు సుదూరం నుంచి వచ్చారు అని ఫ్రీ ప్రెస్ జర్నల్ తెలిపింది.
రెమోనా డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తూ వీడియోలకు ప్రతిస్పందించారు. అందులో ఎక్కువ మంది భారతదేశంలో మనం కోరుకునే స్త్రీవాదం ఇదే అని వ్యాఖ్యానించారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..