
గుర్రాన్ని వదిలి స్మగ్లర్ పరారైన ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. దీంతో పశ్చిమ చంపారన్ జిల్లా నౌతన్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి కొత్త సమస్యలో చిక్కుకున్నారు. గుర్రాన్ని పట్టుకుని కస్టడీలోనైతే పెట్టారు గానీ దాన్ని మేపడానికి పోలీసులు అగచాట్లు పడుతున్నారు. అక్రమ మద్యం రవాణా ఘటనలో గుర్రం పట్టుబడింది. దాన్ని వదలి పరారైన స్మగ్లర్ ఆచూకీ తెలియకపోవడంతో గుర్రాన్ని సంరక్షించాల్సిన బాధ్యత పోలీసులపై పడింది. ఈ క్రమంలో గుర్రాన్ని సంరక్షించే వ్యక్తికోసం పోలీసుల ప్రయత్నాలు మొదలు పెట్టారు. కేసు విచారణ అనంతరం గుర్రాన్ని ప్రభుత్వం వేలం వేయనుంది.
మే 27న 50 లీటర్ల అక్రమ మద్యం రవాణా చేస్తుండగా నౌతన్ పోలీసులు జరిపిన దాడిలో ఈ గుర్రం చిక్కింది. స్మగ్లింగ్ చేస్తున్న అకాశ్ యాదవ్ అనే వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. అతని గురించి పోలీసులు గాలింపు మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ గుర్రాన్ని పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఉంచి చూసుకుంటున్నామని నౌతన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజేష్ కుమార్ తెలిపారు. పోలీస్ స్టేషన్ ఖర్చులతోనే దానికి పచ్చిగడ్డి, శనగలు, బెల్లం వంటివి ఆహారంగా అందిస్తున్నామని చెప్పారు. గుర్రాలను సంరక్షించడంలో అనుభవం ఉన్న సరైన వ్యక్తి దొరికిన తర్వాత, అధికారిక ప్రక్రియ ద్వారా గుర్రాన్ని వారికి అప్పగిస్తామని వెల్లడించారు.
కేసు విచారణ సమయంలో అవసరమైనప్పుడు గుర్రాన్ని కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. విచారణ పూర్తయి, తీర్పు వెలువడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ గుర్రాన్ని వేలం వేస్తుంది. కోర్టు ప్రక్రియ కొనసాగినంత కాలం గుర్రాన్ని సంరక్షించిన వ్యక్తికి వేలంలో దాన్ని కొనుగోలు చేసేందుకు మొదటి అవకాశం కల్పిస్తారు. ఒకవేళ వారు ఆసక్తి చూపకపోతే, ఇతరులకు ఆ అవకాశం దక్కుతుంది. అయితే పోలీస్ కస్టడిలో గుర్రం అనే అంశం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై పలువురు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
#WATCH | Bettiah, Bihar: In the West Champaran district of Bihar, the police have seized a horse that was being used to smuggle liquor and recovered about 50 litres of alcohol loaded on the horse.
Rajesh Kumar, SHO Nautan PS says “During a raid yesterday, we recovered 49.95… pic.twitter.com/NcTcaMFers
— ANI (@ANI) May 28, 2025