
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో హృదయ విధారకమైన ఘటన చోటు చేసుకుంది. కుటుంబానికి భారమనుకున్నారో ఏమో ఓ వృద్ద మహిళను చెత్తకుప్పలో పడేసి వెళ్లిపోయారు. ఈ ఘాతుకానికి పాల్పడింది సాక్షాత్తు ఆ వృద్దురాలి మనుమడే అనే ఆరోపణలున్నాయి. ఆ వృద్దురాలు చర్మ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉదయం చెత్త సేకరించే మున్సిపల్ కార్మికులకు చెత్తకుండిలో పడి ఉన్న వృద్దురాలు కనిపించడంతో అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ముంబై నగరంలోని ఆరే కాలనీలో రోడ్డుపై ఉన్న చెత్త కుప్ప దగ్గర శనివారం 60 ఏళ్ల వృద్దురాలు బలహీన స్థితిలో పడి ఉండటం చూసి షాక్ అయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె యశోద గైక్వాడ్‌గా గుర్తించారు. చర్మ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆ వృద్దురాలిని కావాలనే కుటుంబ సభ్యులు అక్కడ వదిలేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యుల కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో, తన మనవడే అక్కడే వదిలేశాడని ఆ మహిళ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉదయం ఆ మహిళ కనిపించినప్పటికీ, సాయంత్రం 5:30 గంటల వరకు పోలీసులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి దృష్ట్యా, అనేక ఇతర ఆసుపత్రులు ఆమెను చేర్పించుకోవడానికి నిరాకరించడంతో చివరికి ఆమెను కూపర్ ఆసుపత్రిలో చేర్చారు.
ఆ వృద్ధ మహిళ తన కుటుంబ సభ్యులకు సంబంధించిన రెండు అడ్రస్‌లను పోలీసులకు అందించింది. మలాడ్‌లో, కాండివాలిలో తమ కుటుంబ సభ్యులు నివసిస్తున్నారని చెప్పింది. దీంతో బంధువులను గుర్తించడానికి ఆమె ఫోటోను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. అయితే మనవడు ఇలాంటి అమానవీయ పని ఎందుకు చేస్తాడనేదానిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.