
లక్నో, జూన్ 16: ఓ వ్యక్తి ఇంట్లో అక్వేరియంలో పెంచుకుంటున్న తన పెట్ చేపలు చచ్చిపోయాయని దారుణానికి పాల్పడ్డాడు. ఫ్యాన్‌కి ఉరిపెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కాంటోన్మెంట్ ప్రాంతంలోని బీబీ కా హటాలో రాకేష్ అనే వ్యక్తి కుటుంబం నివసిస్తుంది. ఆయనకు ముగ్గురు కుమారులు. వారిలో కృష్ణకాంత్‌కు చేపలంటే చాలా ఇష్టం. కృష్ణకాంత్ తన ఇంట్లో అక్వేరియంలో చేపలను ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉండేవాడు. అయితే కుటుంబానికి ఇన్వర్టర్ సౌకర్యం లేకపోవడంతో శుక్రవారం ఉదయం ఎక్కువ సేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అక్వేరియానికి అవసరమైన గాలి పంపు (ఎయిర్ పంప్) పనిచేయకపోవడంతో చేపలకు ఆక్సిజన్ అందలేదు. ఫలితంగా అక్వేరియంలోని చేపలు మృతి చెందాయి. తాను ఎంతో ప్రేమగా చూసుకున్న చేపలు చనిపోవడంతో యువకుడు తీవ్ర ఆవేదనకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ సంఘటన తర్వాత అతడు తీవ్ర మానసిక వేదనకు గురవడంతో కుటుంబ సభ్యులు అతన్ని ఓదార్చి, మనోధైర్యం చెప్పడానికి ప్రయత్నించారు. కానీ అతను ఆ షాక్ నుండి తేరుకోలేకపోయాడు. శుక్రవారం అతను తన గదిలోకి వెళ్లి తలుపులు వేసు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మరుసటి రోజు అంటే శనివారం ఉదయం కుటుంబ సభ్యులు గదిలోకి వెళ్లి చూడగా యువకుడు ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం పంపించారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి తండ్రి రాకేష్ మాట్లాడుతూ తన కుమారుడికి చేపలంటే చాలా ఇష్టమని, వాటి మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడని తెలిపారు. అక్వేరియంలోని చేపలు చనిపోవడమే ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు పేర్కొన్నారని కాంట్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ అరవింద్ రాయ్ తెలిపారు. ప్రాథమిక విచారణలో ఇది ఆత్మహత్యగా కనిపిస్తున్నప్పటికీ, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెప్పారు. పోస్ట్‌మార్టం నివేదిక అందిన తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.