UKBeReady: మూడ్రోజులు కరెంటు బంద్.. ప్రజలకు బ్రిటన్ ప్రభుత్వం కీలక సూచనలు

UKBeReady: కరెంట్ లేదు.. ఇంటర్నెట్ పనిచేయడం లేదు.. ఏటీఎంలు, ఆన్‌లైన్ పేమెంట్లు ఆగిపోయాయి. ఇలాంటి పరిస్థితి ఎదురైతే మూడు రోజులు ఎలా గడుపుతారు? ఇంట్లో ఆహారం, నీళ్లు ఉన్నాయా? బ్రిటన్ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. ప్రతి ఇంట్లో కనీసం మూడు రోజులకు సరిపడా ఆహారం, నీళ్లు, ఇతర నిత్యావసర వస్తువులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. ఇంతకీ ప్రభుత్వం ఎందుకీ సూచనలు చేసింది? ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉంచుకోవాలి?

UKBeReady: మూడ్రోజులు కరెంటు బంద్.. ప్రజలకు బ్రిటన్ ప్రభుత్వం కీలక సూచనలు
Uk Tells Households To Prepare To Survive For 3 Days Without Power

Updated on: Oct 24, 2026 | 11:10 PM

కరెంట్ లేదు.. ఇంటర్నెట్ పనిచేయడం లేదు.. ఏటీఎంలు, ఆన్‌లైన్ పేమెంట్లు ఆగిపోయాయి. ఇలాంటి పరిస్థితి ఎదురైతే మూడు రోజులు ఎలా గడుపుతారు? ఇంట్లో ఆహారం, నీళ్లు ఉన్నాయా? బ్రిటన్ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. ప్రతి ఇంట్లో కనీసం మూడు రోజులకు సరిపడా ఆహారం, నీళ్లు, ఇతర నిత్యావసర వస్తువులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. ఇంతకీ ప్రభుత్వం ఎందుకీ సూచనలు చేసింది? ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉంచుకోవాలి?

మూడు రోజులకు సరిపడా నిత్యావసరాలు సిద్ధం చేసుకోండి!

గత వారం బ్రిటన్ లో PHP సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా జనజీవనం స్తంభించింది.  రాబోయే కాలంలో వేసవి ఉష్ణోగ్రతలు, కరువు పరిస్థితులు, అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు ఎదురయ్యే అవకాశం ఉంది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రతి కుటుంబం ముందుగానే సిద్ధంగా ఉండాలని తాజాగా బ్రిటన్ ప్రభుత్వం ‘బీ రెడీ’ (Be Ready) క్యాంపెయిన్‌ ను ప్రారంభించింది. ఇలాంటి సమయాల్లో విద్యుత్ సరఫరా, సమాచార వ్యవస్థలు, చెల్లింపుల సేవలకు అంతరాయం కలిగితే ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అందుకే కనీసం మూడు రోజుల పాటు బయట నుంచి ఎలాంటి సహాయం అందకపోయినా ఇంట్లోనే ఉండగలిగేలా అవసరమైన వస్తువులను సిద్ధం చేసుకోవాలని సూచించింది.

ప్రతి వ్యక్తికి 9 లీటర్ల నీరు అవసరం!

అత్యవసర పరిస్థితుల్లో తాగునీటి కొరత ఏర్పడకుండా ముందుగానే నీటిని నిల్వ చేసుకోవాలి. ఒక్కొక్కరికి రోజుకు మూడు లీటర్ల నీరు అవసరం. మూడు రోజులకు ఒక వ్యక్తికి కనీసం 9 లీటర్ల నీరు సిద్ధంగా ఉంచుకోవాలి. విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు ఫ్రిజ్ పనిచేయకపోవచ్చు. వంట చేసుకునే అవకాశం లేకపోవచ్చు. అందువల్ల వండాల్సిన అవసరం లేని, ఫ్రిజ్‌లో పెట్టకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండే ఆహార పదార్థాలను ఇంట్లో ఉంచుకోవాలి. టిన్‌లో నిల్వ చేసిన మాంసం, చేపలు, క్యాన్డ్ కూరగాయలు, ఎండబెట్టిన పండ్లు, ఎక్కువ కాలం నిల్వ ఉండే ఇతర ఆహార పదార్థాలను కొని పెట్టుకుంటే అత్యవసర పరిస్థితుల్లో ఆహారం, నీటి కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు.

కరెంట్ పోతే ఈ వస్తువులు తప్పనిసరి!

విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఫోన్లలో ఛార్జింగ్ అయిపోయి, ఇంటర్నెట్ పనిచేయదు.  కొన్ని ముఖ్యమైన వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలని ప్రభుత్వం సూచించింది.

1. బ్యాటరీతో పనిచేసే రేడియో: విద్యుత్ సరఫరా నిలిచిపోయినా అత్యవసర సమాచారాన్ని తెలుసుకోవడానికి బ్యాటరీతో పనిచేసే లేదా చేతితో తిప్పి ఛార్జ్ చేసే ఎఫ్‌ఎం రేడియో ఉపయోగపడుతుంది.

2. పవర్ బ్యాంక్: మొబైల్ ఫోన్ పనిచేయాలంటే ఛార్జింగ్ అవసరం. అందువల్ల పూర్తిగా ఛార్జ్ చేసిన పవర్ బ్యాంక్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి.

3. టార్చ్‌లైట్: రాత్రివేళ విద్యుత్ సరఫరా నిలిచిపోతే చీకట్లో ఇబ్బంది పడకాకుండా బ్యాటరీతో పనిచేసే టార్చ్‌ను అందుబాటులో ఉంచుకోవాలి.

4. క్యాష్‌: కరెంట్ లేదా సాంకేతిక సమస్యల కారణంగా డిజిటల్ చెల్లింపులు పనిచేయనప్పుడు అవసరాల కోసం కొంత క్యాష్‌ దగ్గర పెట్టుకోవాలి.

5. మందులు, ప్రథమ చికిత్స పెట్టె: రోజూ వాడే మందులతో పాటు చిన్నపాటి గాయాలకు ఉపయోగపడే ప్రథమ చికిత్స సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలి.

6. శానిటైజర్, దుప్పట్లు: వ్యక్తిగత పరిశుభ్రత కోసం హ్యాండ్ శానిటైజర్, చలి నుంచి రక్షణ కోసం దుప్పట్లు లేదా స్లీపింగ్ బ్యాగ్‌లను సిద్ధం చేసుకోవాలి.

ఆహార సరఫరాకు అంతరాయం ఏర్పడితే?

బ్రిటన్ తన ఆహారాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేస్తుంది. దాదాపు 40 నుంచి 50 శాతం వరకు విదేశాల నుంచే వస్తుంది. పండ్ల విషయంలో దిగుమతులపై ఆధారపడటం మరింత ఎక్కువ. దేశంలో వినియోగించే పండ్లలో సుమారు 80 శాతం దిగుమతి చేసుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల్లో అంతరాయం ఏర్పడినా, రవాణా సమస్య తలెత్తినా ఆహార లభ్యతపై ప్రభావం పడకుండా  ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.

భయపడాల్సిన అవసరం లేదు: ప్రధాని

అనుకోని ఘటనలు గతంతో పోలిస్తే ఎక్కువగా ఎదురవుతున్నాయని బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్ పేర్కొన్నారు. గతంలో అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభుత్వం వాటిని ఎదుర్కొనేందుకు అప్పటికప్పుడు స్పందించాల్సి వచ్చేదని, ఇప్పుడు మరింత ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సూచనల ఉద్దేశం ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం కాదని, కష్టసమయాల్లో ఉపయోగపడేలా ఇంట్లో తగినన్ని నిత్యావసర వస్తువులు ఉంచుకోవడం వివేకవంతమైన చర్య అన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us