
London Paan Stains: గుట్కా, పాన్ పరాక్, తమలపాకు నమలడం రోడ్డుపై , వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయడం మన దగ్గర చాలా కామన్. కొందరు చేసే ఇలాంటి చెత్త పనుల వల్ల ఎక్కడ పడితే అక్కడ, రోడ్లు ఎర్రటి మరకలతో చండాలంగా మారుతుంటాయి. చివరకు బస్టాండ్‌లలో కూడా ఇలాంటి మరకలు దర్శనమిస్తుంటాయి. ఎక్కడ చూసినా ఎర్రటి మరకలు అసహ్యం కలిగిస్తుంటాయి. సరిగ్గా ఇలాంటి సమస్యనే ఇప్పుడు లండన్ ప్రజలు కూడా అనుభవిస్తున్నారు. పాన్, గుట్కా మరకలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆ మరకలను క్లీన్ చేసేందుకు అటూ ప్రభుత్వానికి కూడా భారీగానే ఖర్చు చేయాల్సి వస్తోంది. లండన్ వీధుల్లో పాన్ మరకల విధ్వంసం ఎలా ఉందో చూపించే వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
లండన్ వీధుల్లో పాన్ మరకల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. UK జర్నలిస్ట్ బ్రూక్ డేవిస్ ఈ సంఘటనను కెమెరాలో బంధించారు. ఇది ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది. లండన్‌లోని వెంబ్లీ ప్రాంతంలో 30 నిమిషాల వాకింగ్‌లో ఆమె దాదాపు చోట్ల 50 పాన్ మరకలను గుర్తించి లెక్కించింది. ఇందతా వీడియో తీసి ఇంటర్‌నెట్‌లో అప్‌లోడ్ చేయటంతో వైరల్‌గా మారింది.
30 నిమిషాల్లో 50 మరకలు…
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో బ్రూక్ డేవిస్ వ్యంగ్యంగా ఇలా రాశారు.. లండన్ ఎరుపు రంగు మరకలపై చర్చిందాం అంటూ రాశారు. ఈ మరకలు పాన్ ఉమ్మివేయడం వల్ల వస్తాయని, ఇవి చాలా మురికిగా కనిపించడమే కాకుండా శుభ్రం చేయడం కూడా కష్టమని ఆమె వివరించింది. బ్రూక్ ప్రకారం, ఈ సమస్య స్థానిక నివాసితులకు, దుకాణదారులకు తీవ్ర తలనొప్పిగా మారిందని మండిపడ్డారు.
ఇప్పటికే పాన్ మరకల శుభ్రతకు లక్షలు ఖర్చు చేస్తున్న కౌన్సిల్..
నగరంలో ఈ పాన్ మరకలు ఆర్థిక భారంగా మారడమే కాకుండా.. చూడటానికి కూడా ఇబ్బంది కలిగిస్తున్నాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. బ్రెంట్ కౌన్సిల్ ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి, జీరో-టాలరెన్స్ పాలసీని ప్రకటించింది. పాన్ ఉమ్మి మరకలను తొలగించడానికి కౌన్సిల్ ఏటా £30,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తోందని నివేదికలు సూచిస్తున్నాయి. దీనిని నివారించడానికి, హాట్‌స్పాట్ ప్రాంతాలలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. గస్తీ పెంచారు. పాన్ ఉమ్మివేసేవారికి జరిమానా కూడా విధిస్తున్నారు.. ప్రజా అవగాహన పెంచడం, సరైన మార్గంలో వ్యర్థాలను పారవేయడంపై కూడా కౌన్సిల్ దృష్టి సారించింది.
కఠినంగా శిక్షించాలని డిమాండ్
సోషల్ మీడియాలో ఈ వీడియోకు తీవ్ర స్పందనలు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు కఠినమైన చట్టాలు అమలు చేయాలని, కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈ వీడియోలపై అనేక మంది భారతీయ వినియోగదారులు ఈ చర్యను సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..