Video: అమెరికాలో ఢీకొన్న రెండు విమానాలు.. వీడియో చూస్తే షాకే!

విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు చిన్న కుదుపు వచ్చినా ప్రయాణికులు ఆందోళన చెందుతారు. అలాంటిది విమానాశ్రయంలోనే రెండు భారీ విమానాలు ఒకదానికొకటి ఢీకొంటే పరిస్థితి ఎలా ఉంటుంది? అమెరికాలోని మయామీ విమానాశ్రయంలో ఇలాంటి అనూహ్య ఘటన చోటుచేసుకుంది. రన్‌వేపైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న రెండు విమానాలు ట్యాక్సీవే వద్ద ఢీకొన్నాయి. విమానం ముక్కు భాగం నలిగిపోయిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Video: అమెరికాలో ఢీకొన్న రెండు విమానాలు.. వీడియో చూస్తే షాకే!
Two Planes Collide At Miami Airport Video Footage Of Crushed Aircraft Nose Viral

Updated on: Nov 15, 2026 | 4:41 PM

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మయామీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. యూపీఎస్ (UPS)కు చెందిన బోయింగ్ 767 కార్గో విమానం, కోపా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 ప్రయాణికుల విమానం ఒకదానికొకటి ఢీకొన్నాయి. విమానాశ్రయంలోని రెండు ట్యాక్సీవేలు కలిసే ప్రాంతంలో రాత్రి సుమారు 9:15 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే?

వివరాల్లోకి వెళ్తే.. యూపీఎస్‌కు చెందిన బోయింగ్ 767 విమానం ఫ్లైట్ నంబర్ 358తో మియామీ నుంచి కొలంబియాలోని బొగోటాకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. అదే సమయంలో పనామా రాజధాని పనామా సిటీ నుంచి వచ్చిన కోపా ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 విమానం ఫ్లైట్ నంబర్ 427 ల్యాండింగ్ అనంతరం ట్యాక్సీవేపై కదులుతోంది. ఈ క్రమంలో రెండు విమానాలు ఒకదానికొకటి తగిలాయి.

ఈ ఢీకొట్టుకోవడంతో కోపా ఎయిర్‌లైన్స్ విమానం ముందు భాగం దెబ్బతింది. విమానం ముక్కు భాగం నలిగిపోయినట్లు కనిపిస్తోంది. భారీ విమానాలు కావడంతో ప్రమాదం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. అదృష్టవశాత్తూ ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు.

ప్రయాణికుడి కెమెరాలో ప్రమాదం తర్వాతి దృశ్యాలు

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కోపా ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ప్రమాదం తర్వాత విమానం ముందు భాగానికి జరిగిన నష్టాన్ని తన కెమెరాలో రికార్డ్ చేశాడు. విమానాల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆడియో కూడా బయటకు వచ్చింది. అందులో ఓ వ్యక్తి.. ‘మేం కొంచెం ముందుకు వెళ్లిపోయాం.. అతను తన రెక్కతో మమ్మల్ని తాకాడు’ అని వినిపించింది. అయితే ఏ విమానంలో ఎక్కడ తప్పు జరిగింది? రెండు విమానాలు ఎలా ఒకదానికొకటి దగ్గరయ్యాయి? ఈ విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు.

విమానాశ్రయ అధికారులు ఏమన్నారంటే?

ఈ ఘటనను మయామీ-డేడ్ ఫైర్ రెస్క్యూ అధికారులు ధ్రువీకరించారు. మయామీ అంతర్జాతీయ విమానాశ్రయ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గ్రెగ్ చిన్ మాట్లాడుతూ.. రాత్రి 9:15 గంటల సమయంలో రెండు ట్యాక్సీవేలు కలిసే ప్రాంతంలో ఓ విమానం, మరో విమానాన్ని ఢీకొందని ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు. విమానాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఇతర ట్యాక్సీవేల ద్వారా విమానాలను మళ్లించారు.

అమెరికాలో విమాన సర్వీసులకు వరుస సమస్యలు

అమెరికాలో ఇప్పటికే విమానయాన రంగం పలు సమస్యలను ఎదుర్కొంటోంది. శుక్రవారం దేశవ్యాప్తంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థల్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దేశవ్యాప్తంగా తాత్కాలికంగా గ్రౌండ్ స్టాప్ విధించింది. దాదాపు ఐదు గంటల పాటు చాలా వరకు బయలుదేరాల్సిన విమానాలు నిలిచిపోయాయి.

శుక్రవారం సాయంత్రం ఆంక్షలను ఎత్తివేసినప్పటికీ విమానయాన సంస్థలకు ఇబ్బందులు కొనసాగాయి. విమానాలు, సిబ్బందిని తిరిగి సరైన ప్రాంతాలకు చేర్చి షెడ్యూల్స్‌ను సర్దుబాటు చేయాల్సి వచ్చింది. దీంతో పలు విమానాలు ఆలస్యమయ్యాయి. మరికొన్ని సర్వీసులు రద్దయ్యాయి.

పాతబడిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థల్లోని స్విచ్‌లు, రౌటర్లపై డేటా భారం పెరగడంతో రాడార్, కమ్యూనికేషన్ వ్యవస్థల్లో సమస్యలు తలెత్తినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం (నవంబర్ 15) చివరి నాటికి అమెరికాలో విమాన ప్రయాణాలు చాలావరకు సాధారణ స్థితికి చేరుకుంటాయని FAA అడ్మినిస్ట్రేటర్ బ్రయాన్ బెడ్‌ఫోర్డ్ తెలిపారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us