
అది కొలంబియాలోని మెడెల్లిన్ ఎయిర్‌పోర్ట్. అప్పుడే యూఎస్ నుంచి వచ్చిన ఓ విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. ఒక్కొక్కరిగా ప్రయాణీకుల ఇమ్మిగ్రేషన్ చెక్‌లు జరుగుతుండగా.. ఓ నలుగురు వ్యక్తులపై అనుమానం కలిగింది. వారిని పక్కకు పిలిచి.. లగేజి స్కాన్ చేయగా.. దెబ్బకు షాక్ అయ్యారు. ఓ వ్యక్తి బ్యాగ్‌లో ఏకంగా 100 కండోమ్ ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. దేశంలోకి ఎందుకొచ్చారు.? ఆ ప్యాకెట్ల సంగతేంటి అని అధికారులు ప్రశ్నించగా.. వారి వద్ద నుంచి పొంతనలేని సమాధానాలు వచ్చాయి. దీంతో ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారంతా అమెరికా దేశస్థులుగా గుర్తించిన అధికారులు.. లైంగిక పర్యాటకం కోసం కొలంబియాకు వచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. ఆపై ఈ నలుగురిలో ముగ్గురు వ్యక్తులను పనామా నగరానికి, నాలుగో వ్యక్తిని మయామికి తిరిగి పంపించినట్టుగా తెలుస్తోంది.
‘ఆంటియోక్వియాలో ఇమ్మిగ్రేషన్ తనిఖీలను బలోపేతం చేయడం.. లైంగిక పర్యాటకానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక చర్యలు లాంటివి కఠినతరం చేస్తున్నామని’ అధికారులు అంటున్నారు. ఇలాంటి వస్తువులతో దేశంలోకి రావాలనుకున్న వ్యక్తులను అధికారులు అడ్డుకుంటున్నారు. 2024 నుంచి ఇప్పటిదాకా సుమారు 102 మంది ఎంట్రీని బ్యాన్ చేశారు. అలాగే ఈ సంవత్సరం ఇప్పటివరకు, దాదాపు 70 మంది అనుమానిత లైంగిక టూరిస్టులకు కొలంబియాలో ఎంట్రీ బ్యాన్ చేశారు. వీరిలో ఎక్కువ మంది అమెరికా పౌరులు ఉండటం గమనార్హం.