
మొఘల్ సామ్రాజ్య వైభవం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది తాజ్ మహల్. కానీ, షాజహాన్ చక్రవర్తి సంపదకు, కళాభిరుచికి అసలైన నిదర్శనం మయూర సింహాసనం. దీనిని పార్సీ భాషలో తఖ్త్-ఇ-తావుస్ అని పిలిచేవారు. అప్పట్లో దీని నిర్మాణం కోసం చేసిన ఖర్చు వింటే నేటికీ ఎవరైనా విస్తుపోవాల్సిందే. షాజహాన్ ఈ సింహాసనాన్ని నిర్మించడానికి దాదాపు ఏడు సంవత్సరాల సమయం పట్టింది. దీని తయారీకి సుమారు 1150 కిలోల బంగారం, వందల కొద్దీ వజ్రాలు, కెంపులు, పచ్చలు, ముత్యాలు వంటి విలువైన రత్నాలను ఉపయోగించారు. తాజ్ మహల్ నిర్మాణానికి అప్పట్లో సుమారు 3.2 కోట్ల రూపాయలు ఖర్చు కాగా, మయూర సింహాసనానికి 10 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయినట్లు అంచనా. అంటే, తాజ్ మహల్ కంటే ఇది రెండింతలు ఖరీదైనదన్నమాట.
ఈ సింహాసనం పీఠానికి వెనుక రెండు నెమళ్ల ఆకృతులు ఉండేవి. ఆ నెమళ్ల మధ్యలో ఒక అద్భుతమైన వజ్రం పొదగబడింది. దానితో పాటు సింహాసనానికి పైన ఉన్న గుడారం వంటి ఆకృతికి లోపలి భాగంలో విలువైన రాళ్లు, వెండి తీగలతో అలంకరణ ఉండేది. ప్రపంచంలోనే అత్యంత విలువైనదిగా భావించే కోహినూర్ వజ్రం కూడా ఈ సింహాసనం పైభాగంలోనే అమర్చబడి ఉండేదని ప్రతీతి. ఈ సింహాసనం సుమారు 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు ఉండేది. షాజహాన్ 1635లో మొదటిసారిగా దీనిపై కూర్చున్నాడు.
దాదాపు వంద ఏళ్ల పాటు మొఘల్ చక్రవర్తుల వైభవానికి నిదర్శనంగా ఉన్న ఈ సింహాసనంపై పర్షియా రాజు నాదిర్ షా కన్ను పడింది. 1739లో ఢిల్లీపై దండెత్తిన నాదిర్ షా, మొఘల్ సైన్యాన్ని ఓడించి ఎర్రకోటలోని అమూల్యమైన సంపదతో పాటు మయూర సింహాసనాన్ని కూడా దోచుకెళ్లాడు. దురదృష్టవశాత్తు, ఆ తర్వాత జరిగిన యుద్ధాల్లో, దాడుల్లో ఈ సింహాసనం ముక్కలుగా విడగొట్టబడింది. ప్రస్తుతం ఈ అసలు సింహాసనం ఉనికిలో లేనప్పటికీ, చరిత్ర పుటల్లో ఇది ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన పీఠంగా మిగిలిపోయింది.
మయూర సింహాసనం కేవలం ఒక కూర్చునే ఆసనం కాదు, అది ఒక కాలపు సంపదకు, భారతీయ కళాకారుల అద్భుత పనితనానికి నిదర్శనం. చరిత్రలో ఇలాంటి అపూర్వ కళాఖండాలు మన దేశం నుండి తరలిపోవడం ఒక తీరని వెలితి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..