పాశ్చాత్య పోకడలతో మన దేశంలోనూ డేటింగ్ కల్చర్ ఎక్కువైందని చెప్పొచ్చు. అయితే భారత్ కంటే.. విదేశీ దేశాల్లోనే ఈ డేటింగ్ కల్చర్ కామన్‌గా ఉంటుంది. ఉద్యోగం నుంచి కాస్త వీలు దొరికినప్పుడల్లా చాలామంది వ్యక్తులు తమ గర్ల్‌ఫ్రెండ్‌తో డేట్‌కు వెళ్తుంటారు. అలాగే డేటింగ్ బిజీలో పడిపోయి.. తరచూ ఉద్యోగాలకు సెలవు పెట్టేవారు కూడా లేకపోలేదు. అందుకే ఈ తలనొప్పి ఎందుకనుకుందో.? ఏంటో.? ఏకంగా థాయిలాండ్‌లోనే ఓ కంపెనీ తమ సిబ్బంది కోసం వినూత్నంగా ఆలోచించింది.
వివరాల్లోకి వెళ్తే.. థాయ్‌లాండ్‌కి చెందిన మార్కెటింగ్ ఏజెన్సీ వైట్‌లైన్ గ్రూప్ తమ ఉద్యోగులకు ‘టిండర్ లీవ్’ను ప్రకటించింది. గర్ల్‌ఫ్రెండ్‌తో డేట్‌కి వెళ్లేందుకు ఉద్యోగులకు చెల్లింపులతో కూడుకున్న సెలవులను ఇస్తున్నట్టు తెలిపింది. ఈ లీవ్స్‌ను ఉద్యోగులు జూలై నుంచి డిసెంబర్ మధ్య ఏ సమయంలోనైనా వాడుకోవచ్చునని సదరు కంపెనీ పేర్కొంది. ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఈ సరికొత్త ‘టిండర్ లీవ్’ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అయితే ఆ కంపెనీ మాత్రం టిండర్ లీవ్ పేరిట ఎన్ని రోజులు సెలవులు కేటాయించిందన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఇక ఈ సెలవు కోసం దరఖాస్తు చేసుకునే ఉద్యోగులు ఒక వారం ముందుగా సమాచారం ఇవ్వాలట. ఇక సంస్థ తీసుకున్న ఈ వినూత్న నిర్ణయంతో ఉద్యోగులు తమ పనిలో మరింత మెరుగ్గా రాణిస్తారని నిర్వాహకులు భావిస్తున్నారు. ఏదైతేనేం ప్రస్తుతం ఈ టిండర్ లీవ్ టాపిక్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.