
జూన్ 21 ఖగోళ ప్రేమికులకు ఒక ప్రత్యేకమైన రోజుగా నిలవనుంది. ప్రతి సంవత్సరం జూన్ 21న భూమిపై సుదీర్ఘమైన రోజుగా నిలుస్తుంది. శాస్త్ర సాంకేతిక భాషలో దీనిని సమ్మర్ సోల్‌స్టిస్ అని పిలుస్తారు. ఖగోళ లెక్కల ప్రకారం.. ఈ ఏడాది జూన్ 21, ఆదివారం నాడు మన దేశంలో పగటి సమయం సుమారు 13 గంటల 58 నిమిషాలు ఉంటుంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తల ప్రకారం.. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు, అది తన అక్షంపై పూర్తిగా నిటారుగా ఉండకుండా, 23.5 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. ఈ వంపు కారణంగానే భూమిపై రుతువులు మారడం, పగలు, రాత్రి సమయాల్లో మార్పులు రావడం జరుగుతుంటాయి. జూన్ 21న భూమి ఉత్తర అర్ధగోళం సూర్యుని వైపు గరిష్టంగా వంగి ఉంటుంది. దీనివల్ల సూర్యకిరణాలు భూమధ్యరేఖకు ఉత్తరాన ఉన్న కర్కట రేఖపై నేరుగా 90 డిగ్రీల కోణంలో పడతాయి. ఫలితంగా ఉత్తర అర్ధగోళంలో ఉన్న భారతదేశం, అమెరికా, యూరప్, ఆసియా దేశాలకు ఈ రోజున అత్యధిక సమయం సూర్యకాంతి ఉంటుంది.
ఈ రోజున సూర్యుడు ఆకాశంలో చాలా ఎత్తులో ఉంటాడు. అందువల్ల తూర్పు నుండి పడమర వరకు ప్రయాణించడానికి సూర్యుడికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే భారతదేశంలో పగటి సమయం దాదాపు 14 గంటల వరకు ఉంటే, రాత్రి సమయం కేవలం 10 నుండి 11 గంటలు మాత్రమే ఉంటుంది. అంటే ఇది ఏడాదిలోనే అత్యంత చిన్న రాత్రి. అయితే దీనికి సరిగ్గా వ్యతిరేకంగా దక్షిణ అర్ధగోళంలో ఈ రోజున అత్యంత సుదీర్ఘమైన రాత్రి, అత్యంత చిన్న పగలు ఉంటాయి. అక్కడ ఈ సమయం నుండి చలికాలం ప్రారంభమవుతుంది.
ఈ రోజున మరో అద్భుతమైన వింత కూడా జరుగుతుంది. మధ్యాహ్న సమయంలో సూర్యుడు సరిగ్గా మన నెత్తిన ఉండటం వల్ల, కొన్ని క్షణాల పాటు మన నీడ మనకు కనిపించకుండా మాయమవుతుంది. దీనినే జీరో షాడో డే అని కూడా పిలుస్తారు.
వైదిక, పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం కూడా ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనినే కర్కట సంక్రాంతి అంటారు. అగ్ని తత్వానికి ప్రతీక అయిన సూర్యుడు, జల తత్వమైన చంద్రుని రాశి (కర్కాటకం) లోకి ప్రవేశించడం వల్ల విశ్వంలో ఒక ప్రత్యేకమైన శక్తి సమతుల్యత ఏర్పడుతుంది. ఈ రోజు తర్వాత సూర్యుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయనం వైపు తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. హిందూ సంప్రదాయంలో దక్షిణాయనాన్ని దేవతల రాత్రిగా భావిస్తారు. ఈ సమయం ఆధ్యాత్మిక సాధన, ధ్యానం, వ్రతాలు, నియమాలకు ఎంతో అనుకూలమైనదిగా చెబుతారు.
ఈ రోజున విశ్వంలో సానుకూల శక్తి ప్రవాహం అత్యధికంగా ఉంటుంది. శరీరంలో, ప్రకృతిలో ఉండే ఈ సానుకూల శక్తిని సమతుల్యం చేయడానికి, ఈ ప్రత్యేకమైన రోజునే ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా కూడా జరుపుకుంటారు.