
లోకంలో వింతైన వ్యక్తులకు కొదవ లేదు. కొందరికి విలాసవంతమైన ఆహారం అంటే ఇష్టం, మరికొందరికి శాఖాహారం అంటే ఇష్టం. కానీ అమెరికాలోని చికాగోకు చెందిన 26 ఏళ్ల కార్లోస్ అనే యువకుడికి మాత్రం చాలా వింతైన అలవాటుర ఉంది. అతను సాదాసీదా ఆహారం కంటే.. బతికున్న కీటకాలను, బొద్దింకలను తినడానికే ఎక్కువ ఇష్టపడతాడు. ఇటీవల ప్రముఖ టీవీ షో మై స్ట్రేంజ్ అడిక్షన్ ద్వారా కార్లోస్ ప్రపంచానికి పరిచయమయ్యాడు. అతను ప్రతిరోజూ సుమారు 100 బతికున్న కీటకాలను అలవోకగా తినేస్తాడు. మనకు అవి చూస్తేనే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. కానీ కార్లోస్‌కు మాత్రం అవి వెన్న రాసిన పాప్‌కార్న్ లాంటి రుచిని ఇస్తాయట. బొద్దింకలను అతను అత్యంత రుచికరమైన కూరగాయలతో పోల్చడం గమనార్హం.
వింత అలవాటు వెనుక కార్లోస్ చెప్పే కారణాలు మరింత విచిత్రంగా ఉన్నాయి. ‘‘నేను సజీవంగా ఉన్న కీటకాన్ని నోట్లో వేసుకుని నమిలినప్పుడు.. వాటి విధి నా చేతుల్లో ఉందనే భావన కలుగుతుంది. అవి నా నోట్లో కదులుతున్నప్పుడు నా నాలుకకు ఎవరో మసాజ్ చేస్తున్నట్లుగా, ముద్దాడుతున్నట్లుగా అనిపిస్తుంది’’ అని అతను వివరించాడు. ఈ ఆనందం మరే ఇతర ఆహారంలోనూ తనకు దొరకదని అతను అంటున్నాడు.
కార్లోస్ నిరుద్యోగి అయినప్పటికీ, తన ఈ వింత కోరిక కోసం రోజూ ఖర్చు చేయడానికి వెనుకాడడు. ఒక ఇన్సెక్ట్ షాప్ నుంచి బొద్దింకలు, పురుగులు కొనడానికి ప్రతిరోజూ దాదాపు 8 డాలర్లు ఖర్చు చేస్తాడు. ఈ వింత రుచి తనకు చిన్నప్పటి నుంచే తెలుసని, 4 ఏళ్ల వయసు నుంచే పురుగులను తినడం ప్రారంభించానని అతను చెప్పుకొచ్చాడు. లోకంలో ఎంతోమందికి రకరకాల వ్యసనాలు ఉండవచ్చు కానీ, బతికున్న బొద్దింకలను తినడం అనేది నిజంగానే అత్యంత వింతైన, భయంకరమైన అలవాటుగా నెటిజన్లు భావిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.