AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: రూ. 10 కదాని లొట్టలేసుకుంటూ తాగుతున్నారా.. ఈ వీడియో చూస్తే గుండె గుభేల్‌మనాల్సిందే..

Black Substance in Juice Pack: కళ్లు మూసుకుని ప్యాకెట్లలోని జ్యూస్‌లను నేరుగా తాగేసే అలవాటు ఎంత ప్రమాదకరమో ఈ ఘటన హెచ్చరిస్తోంది. ఇలాంటి ప్యాక్డ్ డ్రింక్స్ కొనేటప్పుడు తయారీ తేదీని గమనించడం, వీలైతే గ్లాసులో పోసుకుని చూశాకే తాగడం వంటి జాగ్రత్తలు పాటించడం ఎంతైనా అవసరం.

Video: రూ. 10 కదాని లొట్టలేసుకుంటూ తాగుతున్నారా.. ఈ వీడియో చూస్తే గుండె గుభేల్‌మనాల్సిందే..
Black Substance In Juice Pack
Venkata Chari
|

Updated on: Jun 09, 2026 | 12:29 PM

Share

Black Substance in Juice Pack: ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం మీరు లేదా మీ పిల్లలు రూ. 10ల జ్యూస్ ప్యాకెట్లు తాగుతున్నారా? అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ సంచలన వీడియోను ఒక్కసారి చూడాల్సిందే. ఒక చిన్న జ్యూస్ ప్యాకెట్‌ను కట్ చేయగానే లోపల కనిపించిన నల్లటి పదార్థం చూసి నెటిజన్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్యాకేజ్డ్ డ్రింక్స్ నాణ్యతపై తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

పిల్లలు తాగే జ్యూస్‌లో ఆ నల్లటి పదార్థం ఏంటి?

కాల్చేసే ఎండల్లో ప్రయాణాలు చేసేటప్పుడు, దాహం వేసినప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎక్కువగా ఇష్టపడేది మ్యాంగో జ్యూస్. అందులోనూ కేవలం పది రూపాయలకే దొరికే ప్యాకెట్లకు మార్కెట్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా చిన్నారులు వీటిని ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. అయితే, తాజాగా ఇంటర్నెట్‌ను కుదిపేస్తున్న ఒక వీడియో ఇప్పుడు ప్రతి ఒక్కరినీ పునరాలోచనలో పడేసింది. మనం అమాయకంగా తాగే ఈ పానీయాలు ఎంతవరకు సురక్షితం అనే పెద్ద ప్రశ్నను తలెత్తేలా చేసింది.

ఇవి కూడా చదవండి

కత్తెరతో ప్యాకెట్ కట్ చేయగానే బయటపడ్డ నిజం!

ప్రస్తుతం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వేగంగా షేర్ అవుతున్న ఆ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి రూ. 10 విలువైన జ్యూస్ ప్యాకెట్‌ను తీసుకుని, కత్తెరతో దాని పైభాగాన్ని కట్ చేయడం కనిపిస్తుంది. ఆ ప్యాకెట్ లోపల ఏముందో చూపించడమే ఆ వ్యక్తి ఉద్దేశం. అయితే, ప్యాకెట్ పూర్తిగా తెరవగానే లోపలి భాగంలో, అడుగున పేరుకుపోయి ఉన్న ఒక వింత నల్లటి పదార్థం బయటపడింది. జ్యూస్ తాగే పైపు వెళ్లే చోటే ఆ నల్లటి మురికి లాంటి పదార్థం ఉండటం చూసేవారికి ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. ప్యాకెట్ సీల్ తెరిచే సమయానికే ఆ వింత వస్తువు లోపల ఉందని వీడియోలో క్లెయిమ్ చేస్తున్నారు. ఈ దృశ్యం చూసిన ఎవరికైనా ఒక్క క్షణం గుండె ఆగినంత పనవుతుంది.

నెటిజన్ల తీవ్ర ఆగ్రహం.. పిల్లలకు దూరంగా ఉంచాలంటూ హెచ్చరికలు..

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడమే ఆలస్యం, నెటిజన్ల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కామెంట్ల రూపంలో ప్రజలు తమ ఆందోళనను, కోపాన్ని వెళ్లగక్కుతున్నారు.

“ఇలాంటి ప్యాక్డ్ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో, ఎంత హానికరమో చెప్పడానికి ఈ వీడియోనే ఒక పెద్ద ఉదాహరణ” అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.

మరో వినియోగదారుడు స్పందిస్తూ.. “ఇలాంటి నమ్మకమైన బ్రాండ్ పేరుతో ఇలాంటి మోసాలు లేదా నిర్లక్ష్యం జరిగితే కంపెనీలు కఠినమైన బాధ్యత వహించాలి. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరగాలి” అని డిమాండ్ చేశారు. మరికొందరు ఈ వీడియోను వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయాలని, ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇలాంటి డబ్బాల్లో లేదా ప్యాకెట్లలో వచ్చే పానీయాలను దూరంగా ఉంచాలని హెచ్చరిస్తున్నారు.

వైరల్ వీడియోలో కనిపిస్తున్న ఆ నల్లటి పదార్థం అసలు ఏంటి? అది తయారీ లోపమా లేక నిల్వ ఉంచడం వల్ల వచ్చిన బూజు లాంటిదా అనేదానిపై ఇంకా ఎటువంటి అధికారిక స్పష్టత రాలేదు. అయినప్పటికీ, కళ్లు మూసుకుని ప్యాకెట్లలోని జ్యూస్‌లను నేరుగా స్ట్రాలతో తాగేసే అలవాటు ఎంత ప్రమాదకరమో ఈ ఘటన హెచ్చరిస్తోంది. ఇలాంటి ప్యాక్డ్ డ్రింక్స్ కొనేటప్పుడు తయారీ తేదీని గమనించడం, వీలైతే గ్లాసులో పోసుకుని చూశాకే తాగడం వంటి జాగ్రత్తలు పాటించడం ఎంతైనా అవసరం.

మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us