
మనం ఊహించని ప్రమాదాలు ఎలా జరుగుతాయో చెప్పడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. అక్వేరియంను శుభ్రం చేస్తున్న సమయంలో ఒక చిన్న చేప ఏడాది వయస్సున్న బాలుడి గొంతులోకి దూకడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అక్వేరియం శుభ్రం చేస్తున్న సమయంలో ఊహించని విధంగా ఒక చేప ఏడాది చిన్నారి నోట్లోకి దూకి, గొంతులో ఇరుక్కుపోయింది. ఈ షాకింగ్ సంఘటన చూసిన కుటుంబ సభ్యులు వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. చేప గొంతులోని శ్వాసనాళానికి అడ్డుగా పడటంతో చిన్నారికి ఊపిరి ఆడక పరిస్థితి విషమంగా మారింది. ఈ భయంకరమైన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ సంఘటన ఏప్రిల్ 3వ తేదీన ఇండోర్‌లో జరిగింది. కుటుంబ సభ్యులు ఇంట్లోని అక్వేరియంను శుభ్రం చేస్తూ, చేపలను జాగ్రత్త కోసం ఒక చిన్న గిన్నెలో ఉంచారు. అక్కడే ఆడుకుంటున్న ఏడాది చిన్నారి, ఆ గిన్నె దగ్గరకు వెళ్లిన సమయంలో ఒక చేప అకస్మాత్తుగా గాలిలోకి ఎగిరి నేరుగా బాలుడి తెరిచిన నోట్లోకి పడి, గొంతులో ఇరుక్కుపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని మహారాజా యశ్వంతరావు ఆసుపత్రి (MYH)కి తీసుకువెళ్లారు. బాలుడి గొంతులో సుమారు 3 అంగుళాల పొడవున్న చేప ఇరుక్కుపోయి, అతని శ్వాస మార్గాన్ని అడ్డుకుంటున్నట్లు వైద్యులు గుర్తించారు.
వైద్యుల ప్రకారం.. ఎక్స్-రే, స్కాన్ నిర్వహించిన వైద్యులు, చేప గొంతులో లోతుగా ఇరుక్కుపోయిందని గుర్తించారు. అది సజీవంగా ఉన్న సమయంలో రెక్కలు ఆడించడం వల్ల చిన్నారి గొంతు లోపలి భాగాలు దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. దాదాపు గంటన్నర పాటు సాగిన క్లిష్టమైన శస్త్రచికిత్స తర్వాత వైద్యులు ఆ చేపను బయటకు తీయగలిగారు. ఆ బాలుడిని కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో పర్యవేక్షణలో ఉంచారు. అతని పరిస్థితి క్రమంగా మెరుగుపడింది. తరువాత ఆరోగ్యకరమైన స్థితిలో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆ బాలుడు పూర్తిగా బాగున్నాడని వైద్యులు తెలిపారు.
అదృష్టవశాత్తూ వైద్యుల సమయస్ఫూర్తి వల్ల చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన తల్లిదండ్రులందరికీ ఒక గుణపాఠం వంటిది. మన కళ్లముందే ఉండే వస్తువులు కూడా ఒక్కోసారి ప్రాణాంతకంగా మారతాయని ఇది గుర్తు చేస్తోంది. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అక్వేరియం శుభ్రం చేసేటప్పుడు పిల్లలను దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో ప్రయోగాలు చేయకుండా వెంటనే ఆసుపత్రికి తరలించడం వల్ల ప్రాణాపాయం తప్పుతుందని చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…