Viral Video: సెల్ఫీ కోసం వెళ్లాడు.. శవంగా తిరిగొచ్చాడు.. సముద్ర అలలు ఎంత డేంజరో చూడండి

గోవా బాగ బీచ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాన్‌సూన్‌ హెచ్చరికలను విస్మరించి, బీచ్‌లోని రాతి బండపై ఫోటోలకు దిగేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు భారీ అలల తాకిడికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదాన్ని గమనించిన స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినా ఎలాంటి లాభం లేకపోయింది. ప్రస్తుతం సంగటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: సెల్ఫీ కోసం వెళ్లాడు.. శవంగా తిరిగొచ్చాడు.. సముద్ర అలలు ఎంత డేంజరో చూడండి
Baga Beach Accident

Updated on: Jun 25, 2026 | 1:42 PM

గోవా బాగ బీచ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కర్ణాటకలోని విజయపుర (బీజాపూర్) జిల్లాకు చెందిన 34 ఏళ్ల అష్పాక్ మసాలి అనే పర్యాటకుడు ఫోటోల మోజులో ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితులతో కలిసి గోవా పర్యటనకు వచ్చిన అష్పాక్, బాగ బీచ్‌లోని ప్రమాదకరమైన రాతి బండపై కూర్చుని ఫోటోలు దిగేందుకు ప్రయత్నించాడు. అయితే, మాన్‌సూన్‌ సీజన్ కావడంతో ఎగిసిపడుతున్న భారీ అలల గురించి, భద్రతా హెచ్చరికలను అష్పాక్ పెడచెవిన పెట్టాడు. ఒక్కసారిగా భారీ అల రాతి బండపైకి దూసుకురావడంతో అష్పాక్ మసాలి అందులో చిక్కుకుపోయాడు. అలల ఉధృతికి కొట్టుకుపోయి తీవ్రమైన సముద్ర ప్రవాహంలో గల్లంతయ్యాడు. అతడి స్నేహితులు కాపాడేందుకు శ్రమించినా ఫలితం దక్కలేదు.

ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గల్లంతైన అష్పాక్ మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పోస్ట్‌ మార్టం నిమిత్తం మృతదేహాన్ని హాస్పిటల్‌కు తరలించారు. మాన్‌సూన్‌ సమయంలో బీచ్‌లలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నా, పర్యాటకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇలాంటి దుర్ఘటనలకు దారితీస్తోందని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. సురక్షితమైన పర్యాటకం ప్రాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని గుర్తుచేస్తుంది.

ఇక ఈ ఘటన నేపథ్యంలో పర్యాటకులకు అధికారులు కీలక సూచనలు చేశారు. పర్యాటకులను తీరప్రాంతంలోని రాళ్లకు దూరంగా ఉండాలని, అధిక ఆటుపోట్ల సమయంలో లేదా వాతావరణం అనుకూలంగా లేనప్పుడు సముద్రంలోకి ప్రవేశించవద్దని కోరారు. శక్తివంతమైన అలలు ఎలాంటి హెచ్చరిక లేకుండా విరుచుకుపడగలవని, అందువల్ల రాళ్లు ఉండే ప్రాంతాల్లోకి అస్సలు వెళ్లవద్దని సూచించారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us