ఏ ఇంటికైనా సాధారణంగా కరెంటు బిల్లు ఎంత వస్తుంది. మధ్య తరగతి ఇంటికైతే నెలకు రూ.500. కాస్త ఇంట్లో టీవీతో ఫ్రిజ్, ఏసీ వంటి సౌకర్యాలు ఉంటే.. మహా అయితే రూ.1000 లేదంటే రూ.1500లోపు వస్తుంది. అంతకు మించి దాదాపుగా రాదు. అదే ఏదైనా షాపో, హోటలో, ఫ్యాక్టరీ వంటి వాటికౌతే నెలకు రూ.5 వేల నుంచి 8 వేల వరకూ వచ్చే అవకాశం ఉంది. అయితే ఓ వ్యక్తి ఇంటికి ఒక నెల కరెంట్ బిల్లు ఏకంగా రూ.200 కోట్లు వచ్చింది. దీంతో బిల్లు చూసిన సదరు వ్యక్తికి దెబ్బకు మూర్చబోయాడు. ఈ షాకింగ్ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది.
హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలోని బెహెర్విన్ జట్టన్ గ్రామానికి చెందిన లలిత్ ధీమాన్ అనే ఓ వ్యాపారవేత్తకు సొంతఇల్లు ఉంది. అతడికి ప్రతీనెలా రూ.2 వేలకు అటుఇటుగా బిల్లు వస్తుంటుంది. గత నవంబర్ నెలలో రూ.2,500 కరెంట్ బిల్లు చెల్లించాడు. అయితే తాజాగా డిసెంబర్ 2024 నెలకి సంబంధించిన కరెంటు బిల్లు వచ్చింది. బిల్లుపై ఏకంగా రూ.2,10,42,08,405 రావడం చూసి పరేషాన్ అయ్యాడు. ఒక్క నెలకు ఇన్ని కోట్ల బిల్లు రావడం ఏంటని ఆందోళన చెందాడు. అనంతరం కరెంట్ బోర్డు ఆఫీస్‌కు బిల్లు పట్టుకుని పరుగు తీశాడు.
అక్కడి అధికారులకు ఫిర్యాదు చేయగా.. అధికారులు పరిశీలించి సాంకేతిక లోపం కారణంగా అధిక విద్యుత్ బిల్లు వచ్చినట్లు గుర్తించారు. డిసెంబర్ నెల కరెంట్ బిల్లు రూ.4,047గా నిర్ధారించి మరోబిల్లు చేతిలో పెట్టారు. దీంతో హమ్మయ్యా అనుకుంటూ ఇంటి దారిపట్టాడు. గత ఏడాది కూడా గుజరాత్‌లోని వల్సాద్‌లోని ఒక టైలర్ షాప్ యజమానికి తన షాప్ విలువకంటే అధిక విద్యుత్ బిల్లు వచ్చింది. అతడికి ఏకంగా రూ.86 లక్షల బిల్లు రావడంతో అధికారులు సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగిందని తప్పును సరిచేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అడపాదడపా ఇలాంటి సంఘటనలు జరగడం తరచూ చూస్తూనే ఉన్నాం..