Viral: జాలర్లు వేసిన వల బలంగా అనిపించింది – ఆశతో పైకి లాగి చూడగా..

వల వేసిన ప్రతిసారి ఆ గంగమ్మకు మొక్కుతారు జాలర్లు. మంచి జలపుష్పాలు తమ వలలో పడాలని వేడుకుంటారు. అయితే అన్నిసార్లు అదృష్టం కలిసిరావాలని లేదు. కొన్నిసార్లు మాత్రం అరుదైన చేపలు పడి వారి దశ మారిపోతుంది. తాజాగా ఒరిస్సాలో అలాంటి ఘటనే జరిగింది.

Viral: జాలర్లు వేసిన వల బలంగా అనిపించింది - ఆశతో పైకి లాగి చూడగా..
Rare Fish

Updated on: Jul 20, 2025 | 4:15 PM

ఒరిస్సాలోని సుబర్ణపూర్ జిల్లా బినికా పట్టణంలో మహానదిలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఓ అరుదైన చేప చిక్కింది. వల వేసిన కాసేపటికి బరువుగా అనిపించడంతో పైకి లాగగా.. దాదాపు 100 కిలోల బరువుతో, ఆరు అడుగుల పొడవు గల బోధ చేప అందులో పడింది. దీంతో ఆ జాలర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒడ్డుకు తీసుకొచ్చాక ఆ చేపను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు

ఈ చేప శాస్త్రీయనామం ‘గుంచ్ కాట్‌ఫిష్’ (Goonch Catfish). స్థానికులు మాత్రం బోధ చేపగా పిలుస్తుంటారు. భారీ బరువు పెరిగే ఈ చేపల్లో ఔషధ విలువలు కలిగి ఉంటాయని జాలర్లు తెలిపారు. కిలో చేపకు మార్కెట్ ధర రూ.300 వరకు ఉంటుంది. ఇప్పుడు దొరికిన చేప 100 కిలోలు ఉంది కాబట్టి రూ 30 వేల వరకు గిట్టుబాటు అవుతుంది. శరీర శక్తి పెంపు, కొవ్వు కరుగుదల, కీళ్ల నొప్పుల తగ్గింపు వంటి ఆరోగ్య సమస్యలకు ఈ చేప చక్కగా పని చేస్తుందని స్థానికులు చెబుతున్నారు.

“ఇంత పెద్ద చేప మేము జీవితంలో మొదటిసారి పట్టాము” అని మత్స్యకారుడు అనంతరాం ముదులీ ఆనందం వ్యక్తం చేశారు. “గతంలో ఎక్కువగా 30–40 కిలోల బోధ చేపలే చిక్కేవి. కానీ ఇది నూటికి దగ్గరగా ఉంది. గంగమ్మ దయతో ఇలా జరిగిందని భావిస్తున్నాం” అని ఆయన చెప్పారు.

ఈ ఘటన బినికా ప్రాంతంలోనే కాదు, చుట్టుపక్కల గ్రామాలవారిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. చిన్నారుల నుండి వృద్ధుల వరకు ఈ చేపను ఒకసారి చూసేయాలని జనాలు తండోపతండాలుగా తరలివచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి