
వర్షం పడిందంటే చాలు.. ఇంట్లో తేమ పెరిగిపోతుంది. ముఖ్యంగా కిటికీ అద్దాల మీద నీటి బిందువులు చేరడం, దాని వల్ల కిటికీ గట్టు తడిచిపోయి బూజు పట్టడం చాలా మందికి పెద్ద తలనొప్పి. అయితే ఈ సమస్యకు ఒక వింతైన పరిష్కారం ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. కిటికీపై ఒక స్టీల్ చెంచాను ఉంచితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చని ప్రచారం జరుగుతోంది. మరి ఈ చిన్న చిట్కా వెనుక ఉన్న సైన్స్ ఏంటి? ఇది నిజంగా పనిచేస్తుందా? అనేది తెలుసుకుందాం..
ఈ పద్ధతి ప్రకారం.. ఒక ఉక్కు చెంచాను దాని కొన బయటకు కనిపించేలా కిటికీ గట్టు మీద పెట్టాలి. ఇలా చేయడం వల్ల కిటికీ అద్దాల మీద ఏర్పడే నీటి బిందువులు ఆ చెంచాకు అంటుకుని బయటకు కారిపోతాయట. తద్వారా కిటికీ గట్టు తడవదు, గోడలకు బూజు పట్టదు అని చెబుతున్నారు. గదిలోని వెచ్చని, తేమతో కూడిన గాలి చల్లని కిటికీ గాజును తాకినప్పుడు కండెన్సేషన్ ప్రక్రియ జరిగి నీటి బిందువులు ఏర్పడతాయి. విజ్ఞానశాస్త్రం ప్రకారం.. గాజు కంటే లోహం వేగంగా చల్లబడుతుంది. అందుకే గాలిలోని తేమ మొదట లోహపు చెంచాపైనే ఘనీభవిస్తుంది. దీనివల్ల నీరు కిటికీ అద్దాలపై పేరుకుపోకుండా చెంచా ద్వారా బయటకు జారిపోతుంది.
ఈ పద్ధతి వల్ల నీరు ఒక దిశకు మళ్లించబడుతుందే తప్ప, గదిలోని తేమను ఇది తొలగించలేదు. అంటే మీ ఇంట్లో తేమ శాతం ఎక్కువగా ఉంటే కేవలం చెంచా పెట్టడం వల్ల ఫలితం ఉండదు. కేవలం కిటికీ గట్టు పొడిగా ఉండి, పెయింట్ పాడవకుండా చూడటానికి మాత్రమే ఇది కొంతవరకు ఉపయోగపడుతుంది.
అమెరికాకు చెందిన ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, ఆరోగ్య నిపుణులు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలపైనే పూర్తిగా ఆధారపడవద్దని సూచిస్తున్నారు.
వెంటిలేషన్ ముఖ్యం: కిటికీలు తరచుగా తెరవడం, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు వాడటం వల్ల గాలి ప్రసరణ పెరిగి తేమ తగ్గుతుంది.
లీకులపై దృష్టి: ఇంట్లో పైపుల లీకులు ఉంటే వెంటనే సరిచేయాలి.
ఆరోగ్య సమస్యలు: బూజు పట్టడం వల్ల అలెర్జీలు, కంటి చికాకు మరియు శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
కిటికీపై చెంచా పెట్టడం అనేది తాత్కాలికంగా కొంత ఉపశమనాన్ని ఇచ్చే చిన్న ట్రిక్ మాత్రమే. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు సరైన గాలి ప్రసరణ మరియు డీహ్యూమిడిఫైయర్ వంటి శాశ్వత పరిష్కారాల వైపు చూడటమే మేలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.