
పెళ్లి అనేది ఒక పవిత్రమైన బంధం. కలకాలం ఒకరికొకరు తోడు, నీడలా ఉండాలని అంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. చిన్న చిన్న కారణాలకే విడిపోతున్నారు. అది కూడా గంటల వ్యవధిలోనే విడిపోవడం సమాజంలో ఆందోళన కలిగిస్తుంది. తాజాగా అటువంటి ఘటనే పూణేలో జరిగింది. అగ్నిసాక్షిగా ఒక్కటైన వధూవరులు.. 24 గంటలు గడవకముందే విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇది ఒక ప్రేమ వివాహం. ఎన్నో కలలతో ఈ జంట పెళ్లి పీటలెక్కింది. వేడుక ఘనంగా ముగిసింది. కానీ పెళ్లైన కొన్ని గంటలకే భర్త అసలు విషయాన్ని బయటపెట్టాడు.
తాను మర్చంట్ నేవీలో పని చేస్తున్నానని, డ్యూటీ నిమిత్తం ఎప్పుడైనా పిలుపు రావచ్చని భర్త భార్యకు చెప్పాడు. అంతటితో ఆగకుండా ఉద్యోగ రీత్యా ఏడాదిలో కనీసం ఆరు నెలల పాటు ఇంటికి దూరంగా, ఓడలోనే గడపాల్సి ఉంటుందని వివరించాడు. భర్త చెప్పిన ఈ విషయం భార్యను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇంత ముఖ్యమైన విషయాన్ని పెళ్లికి ముందే ఎందుకు చెప్పలేదని ఆమె నిలదీసింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. భర్త తన వృత్తి గురించి ముందే నిజాయితీగా చెప్పి ఉంటే బాగుండేదని ఈ విషయం దాచడం తనను మోసం చేయడమేనని ఆమె భావించింది. పరస్పర అవగాహన లోపించడంతో, పెళ్లైన 24 గంటల్లోనే విడిపోవాలని వారు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వివాహం జరిగిన మరుసటి రోజే వారు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే చట్టపరమైన నిబంధనలు, ప్రక్రియల కారణంగా వారికి విడాకులు మంజూరు కావడానికి 18 నెలల సమయం పట్టింది. ఈ మధ్య కాలంలో కౌన్సిలింగ్ ఇచ్చినా ప్రయోజనం లేకపోవడంతో కోర్టు ఇటీవల వారికి పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరు చేసింది.
సాధారణంగా విడాకుల కేసుల్లో వరకట్న వేధింపులు లేదా గృహ హింస వంటివి కనిపిస్తాయి. కానీ ఈ కేసులో అవేమీ లేవు. కేవలం వృత్తిపరమైన విషయాలను దాచడం, ఆలోచనలు కలవకపోవడమే విడాకులకు దారితీసింది. ఎటువంటి నేరపూరిత ఆరోపణలు లేకుండా ఇద్దరూ శాంతియుతంగా విడిపోవాలని నిర్ణయించుకోవడం గమనార్హం. పెళ్లికి ముందే ఒకరి గురించి మరొకరు స్పష్టంగా తెలుసుకోవాలని లేదంటే ఇటువంటి ఘటనలే జరుగుతాయని నిపుణులు అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..