మత్స్యకారుల వలకు చిక్కిన ఊహించని అద్భుతం.. బండరాయి అనుకొని లాగితే బయటపడ్డ 500 ఏళ్ల మిస్టరీ..

సముద్ర తనలో దాచుకున్న అద్భుతాలును ఎప్పుడోసారి బయటకు చూపిస్తుంటుంది. బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు సముద్రుడు ఒక అపురూపమైన కానుకను అందించాడు. సుమారు 500 సంవత్సరాల క్రితం నాటి, అత్యంత సూక్ష్మమైన శిల్పకళతో చెక్కిన దేవతా విగ్రహం మత్స్యకారుల వలకు చిక్కింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మత్స్యకారుల వలకు చిక్కిన ఊహించని అద్భుతం.. బండరాయి అనుకొని లాగితే బయటపడ్డ 500 ఏళ్ల మిస్టరీ..
Ancient Hindu Goddess Idol Found In Sea

Updated on: Jul 13, 2026 | 7:44 PM

సాధారణంగా వేటకి వెళ్లే మత్స్యకారుల వలలకు చేపలు పడటం సహజం. కానీ పుదుచ్చేరికి చెందిన కొందరు మత్స్యకారుల వలకి ఏకంగా దేశ చరిత్రను, శిల్పకళా వైభవాన్ని చాటిచెప్పే ఒక అరుదైన నిధి దొరికింది. బంగాళాఖాతంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో సుమారు 500 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఒక ప్రాచీన హిందూ దేవుడి విగ్రహం లభ్యమైంది. ఈ అసాధారణ ఆవిష్కరణ ప్రస్తుతం స్థానిక అధికారులు, చరిత్రకారులు, మరియు పురావస్తు శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. ఆకాశవాణి నివేదిక ప్రకారం.. పుదుచ్చేరిలోని కారైకాల్‌కు చెందిన 16 మంది మత్స్యకారులు జూలై 2న కారైకాల్ ఫిషింగ్ హార్బర్ నుండి ఒక మెకనైజ్డ్ బోటులో సముద్రంలోకి వేటకు వెళ్లారు. జూలై 10వ తేదీ అర్ధరాత్రి సమయంలో తమిళనాడులోని మహాబలిపురం తీరానికి సమీపంలో వారు చేపల వేట సాగిస్తుండగా, తమ వలకు ఏదో భారీ వస్తువు తగిలినట్లు గుర్తించారు. మొదట సముద్రం అడుగున ఉన్న ఏదైనా బండరాయికి తమ వల చిక్కుకుపోయి ఉంటుందని వారు భావించారు. కానీ ఎంతో శ్రమించి ఆ వలను పైకి లాగి చూడగా, అందులో ఒక అద్భుతమైన రాతి విగ్రహం కనిపించడంతో వారంతా ఆశ్చర్యపోయారు. ఆ విగ్రహంపై శతాబ్దాలుగా పేరుకుపోయిన సముద్రపు పొరలు ఉండటాన్ని బట్టి, అది చాలా కాలంగా నీటి అడుగునే ఉండిపోయినట్లు స్పష్టమవుతుంది.

అధికారులకు అప్పగింత – దర్యాప్తు ప్రారంభం

సముద్రం నుండి తిరిగి వచ్చిన మత్స్యకారులు ఆ విగ్రహాన్ని సురక్షితంగా భద్రపరచడం కోసం కారైకాల్ డిప్యూటీ కలెక్టర్ పూజకు అందజేశారు. ప్రాథమిక పరిశోధనల ప్రకారం.. ఈ విగ్రహం దాదాపు 500 సంవత్సరాల క్రితం నాటిదని, ఇది తమిళనాడు ప్రాంతానికి చెందినదై ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ ప్రాచీన విగ్రహం సముద్రంలోకి ఎలా చేరిందనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. అంతర్జాతీయ స్మగ్లర్లు దీనిని శ్రీలంకకు అక్రమంగా తరలిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయిందా? లేదా తనిఖీల భయంతో స్మగ్లర్లే దీనిని సముద్రంలో పడేసారా? అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు.

శిల్పకళా వైభవం

లభ్యమైన విగ్రహం మధ్యయుగ భారతదేశపు అద్భుతమైన ఆలయ శిల్పకళా సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది ఒక హిందూ దేవత నిలబడి ఉన్న భంగిమలో చెక్కబడిన రాతి శిల్పం. విగ్రహం తలపై అందమైన కిరీటం, ఒంటిపై విశేష ఆభరణాలు, సూక్ష్మంగా చెక్కబడిన వస్త్రాలంకరణ ఉన్నాయి. ఒక చేత్తో భక్తులను ఆశీర్వదించే ముద్ర, మరో చేతిలో పూజా ద్రవ్యం లేదా ఆయుధాన్ని కలిగి ఉంది. విగ్రహం వెనుక భాగంలో రేఖాగణిత నమూనాలతో కూడిన ఒక అందమైన అలంకార తోరణం చెక్కి ఉంది. ప్రస్తుతం ఈ విగ్రహాన్ని పురావస్తు శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని, దీని ఖచ్చితమైన వయస్సు, పుట్టుక, దీని వెనుక ఉన్న చారిత్రక ప్రాధాన్యతను గుర్తించేందుకు మరిన్ని పరిశోధనలు ముమ్మరం చేశారు.

Follow Us