
మానవత్వానికి సరిహద్దులు ఉండవని, మంచి మనసున్న మనుషులు కలిస్తే ఎలాంటి అద్భుతాలైనా సాధించవచ్చని నిరూపించే హృదయాల్ని హత్తుకునే, ఆనందదాయక సంఘటన అల్జీరియాలో వెలుగుచూసింది. తల్లీతండ్రీ లేని ఒక అనాథ అమ్మాయి తన పెళ్లి విందు కోసం చేసిన చిన్న విన్నపం, దేశవ్యాప్తంగా అపారమైన మానవతా దృక్పథాన్ని, ఐక్యతను రగిల్చింది. ఏ అండ లేని ఆ అమ్మాయికి ఏకంగా ఒక దేశమే కుటుంబంగా నిలబడి, ఊహించని రీతిలో ఆమె వివాహాన్ని జరిపించింది.
ఉత్తర ఆఫ్రికా దేశమైన అల్జీరియాలో మానవత్వానికి నిలువుటద్దంగా నిలిచే ఓ అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. పెళ్లికి రెండు రోజుల ముందు ఓ టీవీ హోస్ట్, అనాథ అయిన ఒక నిరుపేద యువతిని నీకు ఏం కావాలని ప్రశ్నించగా.. నా పెళ్లి విందులో అతిథులకు వడ్డించడానికి ఎవరైనా రెండు కోళ్లు దానం చేస్తే చాలు అని బిడియంగా కోరింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అల్జీరియా ప్రజలు చలించిపోయారు. దేశమంతా ఆ అమ్మాయికి కుటుంబంగా మారింది. వేలాది మంది ఆమె పెళ్లికి తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే.. పూర్తి స్టోరీలోకి వెళ్లాల్సిందే..
అల్జీరియాకు చెందిన ఒక నిరుపేద, అనాథ యువతికి వివాహం నిశ్చయమైంది. అయితే, పెళ్లి రోజు అతిథులకు విందు ఇచ్చేంత ఆర్థిక స్థోమత ఆమె వద్ద లేదు. పెళ్లికి రెండు రోజుల ముందు ఒక టీవీ ప్రెజెంటర్ ఆమెను కలిసి నీ వివాహానికి నీకేం కావాలో కోరుకో? అని అడిగారు. దానికి ఆ యువతి ఎంతో బిడియపడుతూ.. నా పెళ్లికి వచ్చే అతిథులకు వడ్డించేందుకు నా పొరుగువారు ఎవరైనా రెండు కోళ్లు దానం చేస్తే అదే నాకు పెద్ద సహాయం అని ఎంతో అమాయకంగా, ఆవేదనతో సమాధానమిచ్చింది.
ఆ యువతి అమాయకత్వంతో మాట్లాడిన ఆ వీడియో ఇంటర్నెట్‌లో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఆ అనాథ అమ్మాయి ఆవేదన అల్జీరియా ప్రజల హృదయాలను పిండేసింది. ఇంకేముంది.. ఆ దేశ పౌరులు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఒకే తాటిపైకి వచ్చారు. నువ్వు ఒంటరివి కావు, నీ వెనుక మేమందరం ఉన్నాం అంటూ ఆమెకు అండగా నిలబడ్డారు. దేశంలోని ప్రతి మూల నుంచి ఆమెకు సహాయం ప్రవాహంలా రావడం ప్రారంభమైంది.
تمنت دجاجتين فأقاموا لها عرسًا استثنائيًا.. احتفاء واسع في الجزائر بعروس عين الدفلى اليتيمة https://t.co/xKS3bXdAUn
— التلفزيون العربي (@AlarabyTV) October 12, 2026
అప్పటివరకు ఏ ఆదరణా లేని ఆ అనాథ పెళ్లికూతురికి ఊహించని కానుకలు వెల్లువెత్తాయి. పెళ్లి రోజు వేలాది మంది ప్రజలు విచ్చేసి ఆమెను ఆశీర్వదించారు. వచ్చిన కానుకలతో ఆ ఇంట్లో జాగ లేనంతగా నగదు, బంగారు ఆభరణాల సెట్లు, ఖరీదైన గృహోపకరణాలు సమకూరాయి. స్థానిక సామజిక కార్యకర్తలు, ప్రజల సహకారంతో వివాహ ప్రాంగణాన్ని అత్యంత సుందరంగా అలంకరించి, రాయల్ వెడ్డింగ్‌ను తలపించేలా వేడుక నిర్వహించారు. చిన్న కోరికతో మొదలైన ఈ సంఘటన, చివరకు అల్జీరియా చరిత్రలోనే అత్యంత ఘనమైన, మానవత్వపు సంతకమైన కళ్యాణంగా నిలిచిపోయింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..