అక్రమ గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ.. స్మగ్లర్లు లెక్క చేయడం లేదు.. దందాను ఆపడం లేదు. గంజాయి రవాణాకు స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను వెతుకుతూ.. అధికారుల కళ్లు గప్పి రాష్ట్రాలను దాటించేస్తున్నారు. తాజాగా ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో సుమారు 16 క్వింటాళ్ల గంజాయిని జయపురం ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పుష్ప సినిమాలోని సీన్‌ను రిపీట్ చేయాలనుకున్న ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే.. జయపురం పోలీసులకు అక్రమంగా గంజాయి రవాణా జరుగుతోందని సమాచారం అందటంతో ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు స్థానిక ఘాట్ రోడ్డులో మాటు వేశారు. ప్రతీ వెహికిల్‌ను ముమ్మరంగా చెక్ చేస్తుండగా.. అతి వేగంగా వస్తోన్న ఓ ట్రక్కు వారి కంటపడింది. దాన్ని ఆపి సోదా చేయగా.. అందులో 100 బస్తాల కొబ్బరికాయలు, 150 గంజాయి బస్తాలు బయటపడ్డాయి. స్మగ్లర్లు చాలా తెలివిగా కొబ్బరికాయల లోడ్‌తో గంజాయి బస్తాలను కవర్ చేశారు. అయితే ఏముంది పోలీసులు వారి ఆగడాలకు కూల్‌గా చెక్ పెట్టారు. పట్టుబడిన సరుకు సుమారు రూ. 81 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఆ ట్రక్కు నడుపుతోన్న బీహారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.