
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన దూకుడును మరింత పెంచారు. అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్తంగా చేపట్టిన సైనిక విన్యాసాలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో కిమ్ వరుసగా క్షిపణి పరీక్షలను నిర్వహిస్తున్నారు. తాజాగా శనివారం (మార్చి 14, 2026) నాడు జరిగిన మల్టిపుల్ రాకెట్ లాంచ్ సిస్టమ్స్ (MRLS) లైవ్-ఫైర్ పరీక్షలో కిమ్ తన కుమార్తెతో కలిసి పాల్గొన్నారు. కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) విడుదల చేసిన ఫోటోలలో కిమ్, అతని కుమార్తె జు ఏ భారీ ఆలివ్-గ్రీన్ రంగు లాంచ్ ట్రక్కుల దగ్గర నడుస్తూ కనిపించారు. క్షిపణులు నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్తున్న దృశ్యాలను వారు నిశితంగా గమనించారు. గత కొంతకాలంగా కిమ్ తన కుమార్తెను ప్రముఖ సైనిక వేడుకలకు తీసుకురావడం వెనుక, ఆమెను భవిష్యత్తు నాయకురాలిగా తీర్చిదిద్దే ఉద్దేశ్యం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ సందర్భంగా కిమ్ ఈ ఆయుధ వ్యవస్థను అత్యంత ఘోరమైన, ఆకర్షణీయమైన ఆయుధం గా అభివర్ణించారు. ఈ రాకెట్లు సుమారు 420 కిలోమీటర్ల (260 మైళ్లు) దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. అంటే దక్షిణ కొరియాలోని ప్రధాన సైనిక స్థావరాలన్నీ ఈ పరిధిలోకి వస్తాయి. ఒకవేళ ఈ ఆయుధాన్ని ఉపయోగిస్తే, శత్రువుల సైనిక మౌలిక సదుపాయాలు పూర్తిగా నాశనమవుతాయి. అవి ఎప్పటికీ మనుగడ సాగించలేవు అని కిమ్ పేర్కొన్నారు. ఈ రాకెట్ లాంచర్లు వ్యూహాత్మక అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉండటం గమనార్హం.
ఉత్తర కొరియా ఏకకాలంలో సుమారు 10కి పైగా క్షిపణులను ప్రయోగించడంపై దక్షిణ కొరియా, అమెరికా తీవ్రంగా స్పందించాయి. ఇది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించడమేనని, ఈ రెచ్చగొట్టే చర్యలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశాయి. ప్రస్తుతం కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు మరోసారి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వరుస క్షిపణి ప్రయోగాలు, వారసురాలి ప్రదర్శన ద్వారా కిమ్ తన సైనిక పటిష్టతను ప్రపంచానికి చాటిచెప్పాలనుకుంటున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..