
ఈ ఆధునిక యుగంలో ఇంటర్నెట్ అనేది మనిషి జీవితంలో ఒక ముఖ్య భాగంగా మారింది. సెల్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ వాడుతున్నారడంలో ఎలాంటి డౌట్ లేదు. కొద్దిసేపు నెట్ లేకున్నా ఉండలేని స్థితికి జనాలు వచ్చేశారు. మొబైల్ డేటాతో పాటు ప్రతి ఇంట్లో వైఫై కామన్‌గా మారింది. ప్రధానంగా చౌకైన డేటా ప్లాన్‌లు, బడ్జెట్ ధరలోనే లభిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు సామాన్యుడి చేతికి ఇంటర్నెట్‌ను అందించాయి. నెట్ అనేది సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం కాలేదు.. నిత్య జీవితంలో, ఆఫీసు పనిలో ఒక భాగమైపోయింది. ఈ నేపథ్యంలో భారతీయులు రోజుకు ఎన్ని జీబీల ఇంటర్నెట్ వాడుతున్నారనే దానిపై కొన్ని కీలక నివేదికలు ఆసక్తికర వివరాలను వెల్లడించాయి.
నోకియా విడుదల చేసిన లేటెస్ట్ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండెక్స్ నివేదిక ప్రకారం..మన దేశంలో ఒక సగటు మొబైల్ యూజర్ నెలకు 31 GB కంటే ఎక్కువ డేటాను ఉపయోగిస్తున్నాడు. మరో ప్రముఖ సంస్థ ఎరిక్సన్ మొబిలిటీ నివేదిక అయితే.. ఈ సంఖ్య నెలకు ఒక్కో వినియోగదారునికి ఏకంగా 36 GB కంటే ఎక్కువగా ఉందని తెలిపింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అమెరికా, యూరప్, చైనా వంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే కూడా దేశంలోనే మొబైల్ డేటా వినియోగం చాలా ఎక్కువగా ఉంది. దీనిబట్టి చూస్తే సగటున ప్రతి భారతీయుడు రోజుకు 1 GB కంటే ఎక్కువ డేటాను ఖర్చు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
గతంలో కేవలం మెసేజ్‌లు, చిన్న చిన్న బ్రౌజింగ్‌లకే పరిమితమైన ఇంటర్నెట్.. ఇప్పుడు సరికొత్త టెక్నాలజీల వైపు మళ్లింది. డేటా వాడకం ఇంతలా పెరగడానికి ప్రధాన కారణాలు..
వీడియో స్ట్రీమింగ్ – గేమింగ్: యూట్యూబ్, ఓటీటీలలో 4K క్వాలిటీ వీడియోలను చూడటం, ఆన్‌లైన్ క్లౌడ్ గేమింగ్ ఆడటం పెరిగింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: ఏఐ ఆధారిత అప్లికేషన్లు, యాప్‌లను స్మార్ట్‌ఫోన్‌లలో ఎక్కువగా ఉపయోగించడం.
సోషల్ మీడియా రీల్స్: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ వంటి షార్ట్ వీడియో కంటెంట్‌ను గంటల తరబడి స్క్రోల్ చేయడం.
దేశంలో 5G సేవలు శరవేగంగా విస్తరించడం డేటా వినియోగాన్ని విపరీతంగా పెంచేసింది. నివేదికల ప్రకారం.. మెట్రో నగరాల్లో జరుగుతున్న మొత్తం మొబైల్ డేటా ట్రాఫిక్‌లో 58 శాతం వాటా కేవలం 5G నెట్‌వర్క్‌ల ద్వారానే వస్తోంది. దేశంలో ప్రస్తుతం వాడుకలో ఉన్న మొబైల్ పరికరాల్లో సుమారు 383 మిలియన్లకు పైగా డివైజ్‌లు 5G నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేస్తున్నాయి.
ఒకప్పుడు ఇంటర్నెట్ అంటే ఖరీదైన వ్యవహారం. కానీ నేడు ప్రపంచంలోనే అత్యధిక మొబైల్ డేటా వినియోగిస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలవడం ఇక్కడి డిజిటల్ విప్లవానికి అద్దం పడుతోంది. రాబోయే రోజుల్లో ఏఐ అప్లికేషన్లు మరింత పెరిగితే ఈ డేటా వినియోగం ఇంకెంతలా పెరుగుతుందో చూడాలి..