
రెండు కొప్పులు ఒక చోట ఇమడవు.. ఒక ఒరలో రెండు కత్తులు ఉండలేవు.. ఇలాంటి సామెతలు ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సంఘటనలను చూస్తే నిజమే అనిపిస్తుంటుంది. నిజ జీవితంలో మనుషులు ప్రవర్తించే విధానాన్ని బట్టి ఇలాంటి సామెతలు పుట్టుకొచ్చాయనడానికి కొన్ని ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. ఇద్దరు ఆడవాళ్లు ఒకరినొకరు జుట్లు పట్టుకుని తన్నుకున్న ఘటన గురించి మాట్లాడుకోవాలి. ఉత్తరప్రదేశ్ నోయిడాలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ఇద్దరు విద్యార్థినుల మధ్య పిచ్చాపాటి చర్చ తర్వాత ఉన్నట్లుండి గొడవ మొదలైంది. అది కాస్త తీవ్రరూపం దాల్చి ఒకరినొకరు జుట్లు పట్టుకుని కొట్టుకునే వరకూ చేరుకుంది. కాలేజీ ప్రాంగణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో కనిపిస్తున్నదేమిటంటే.. ఎర్రటి చుడీదార్ వేసుకున్న ఓ అమ్మాయి.. తనకు కాస్త దూరంలో కూర్చుని ఉన్న మరో అమ్మాయితో ఏదో విషయమై కాసేపు మాట్లాడింది. ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదు.. ఉన్నట్లుండి దూరంగా నిలబడిన అమ్మాయి ఒక్కసారిగా ముందుకు వచ్చి తను అప్పటివరకు మాట్లాడిన అమ్మాయిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే ఆవేశంలో ఆ అమ్మాయి జుట్టుని గట్టిగా పట్టేసుకుంది. ఇది ఓర్చుకోలేని మరో అమ్మాయి కూడా తిరిగి ఎదురుదాడి చేసేందుకు ముందుకు దూకింది. అలా ఒకరి జుట్లు ఒకరు పట్టుకుని బూతులు తిట్టుకోవడం మొదలుపెట్టారు. ఇంతలో అక్కడే ఉన్న వారి స్నేహితులు ఈ గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. కానీ ఇంతకీ సాధ్యపడకపోవడంతో కాసేపు ఈ తతంగం అలాగే కొనసాగింది. అసలు ఆ ఇద్దరు ముందుగా ఏ విషయంపై మాట్లాడుకున్నారు.. ఆ తర్వాత కొట్టుకునే వరకు గొడవ ఎందుకు మొదలైంది అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఒక నిమిషం 12 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.