new couple video goes viral: మనం నిజంగా ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నామంటే వారిని కచ్చితంగా గౌరవించాలని చెబుతారు. గౌరవం ఉన్న చోటే ప్రేమ కలకాలం నిలిచి ఉంటుంది. ఇది ఎవరూ కాదనలేని నిజం. తాజాగా ఓ జంట ఇలాగే ఒకరిపై ఒకరు చూపించుకున్న గౌరవం అందరినీ ఆకర్షిస్తోంది.
ఇంతకీ విషయమేంటంటే.. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో ఓ జంట వివాహం చేసుకుంది. వివాహ తంతు పూర్తి అయిన తర్వాత వధువు, పెళ్లి కొడుకు కాళ్లకు నమస్కరించుకొని ఆశీర్వాదం తీసుకుంది. ఇది సాధారణంగా అన్ని పెళ్లిల్లో జరిగేదే. అయితే ఇక్కడ ఆ వరుడు మాత్రం తన భార్యపై తనకున్న గౌరవాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు. భార్య ఆశీర్వాదం తీసుకున్న వెంటనే మోకాళ్లపై కూర్చొని భార్యకు నమస్కరించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్రేమను తెలియజేయడంలో గౌరవించడం అన్నింటికంటే గొప్పదనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ కొత్త పెళ్లి కొడుకును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. స్త్రీ, పురుష సమానత్వం అంటే ఇదేనంటూ కామెంట్లు చేస్తున్నారు.