కృత్రిమ గర్భధారణ కోసం ఆస్పత్రికి వెళ్లిన దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. భర్త వీర్యానికి బదులు మరొకరి వీర్యం మహిళకు ఇవ్వడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తమకు జరిగిన అన్యాయానికి న్యాయపోరాటం చేపట్టారు. దాంతో సదరు ఆస్పత్రి బాధితులకు కోటిన్నర పరిహారం చెల్లించుకుంది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
బాధిత జంట అసిస్టెడ్ రిప్రోడక్టివ్ టెక్నిక్‌తో సంతానభాగ్యం పొందేందుకు సదరు ఆసుపత్రిని ఆశ్రయించారు. ఫలితంగా వారికి 2009లో వారికి కవలలు జన్మించారు. ఇంతవరకు బాగానే ఉంది.! అయితే అసలు నిజం మాత్రం ఇప్పుడే బయటపడింది. ఆ ఇద్దరు శిశువులకు డీఎన్‌ఏ పరీక్షలు చేయగా.. వారి తండ్రి మరొకరని తేలింది. దీంతో, ఆసుపత్రి వారి పొరపాటు తేటతెల్లమైంది. ఈ క్రమంలోనే దంపతులిద్దరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమకు సదరు ఆసుపత్రి 2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై కొన్నేళ్ల పాటు సుదీర్ఘ విచారణ జరిగింది. అనంతరం ఈ కేసులో దంపతులిద్దరికి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. సదరు ఆసుపత్రి యాజమాన్యం వారికి రూ. 1.5 కోట్లు చెల్లించాలంటూ ఎన్‌సీడీఆర్‌సీ(NCDRC) ఆదేశించింది. కాగా, కృత్రిమ గర్భధారణకు సంబంధించిన విధానాలను కొత్తగా రూపొందించాలని, జన్మించిన శిశువు డీఎన్‌ఏ వివరాలను కూడా ఇచ్చేలా చూడాలని కమిషన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.(Source)