కాకి.. ఓ బంగారు కంకణం.. కథ ఇది.. ఓ కుటుంబం మొత్తం 10 రోజుల పాటు నిద్రాహారాలు మానుకుని మరి పొగుట్టుకున్న కంకణం కోసం వెతికింది.. అయితే, అది ఓ చెట్టుపై కాకి గూడులో ప్రత్యేక్షమైంది.. ఇదంతా ఓ స్టోరీలా జరిగిపోయిన ఘటన కేరళలోని కోజికోడ్ కప్పాడ్ లో చోటుచేసుకుంది.. కప్పాడ్‌కు చెందిన 1వ తరగతి విద్యార్థిని ఫాతిమా హైఫా తన బంగారు కంకణాన్ని, గొలుసును పోగొట్టుకుంది.. అయితే.. అది ఓ చెట్టుపైనున్న గూడులో దొరికింది. నివాస ప్రాంగణంలో కొబ్బరి చెట్టుపై ఉన్న కాకి గూడు నుంచి 6 గ్రాముల బంగారు ఆభరణాన్ని కుటుంబ సభ్యులు స్వాధీనం చేసుకున్నారు.
అసలేం జరిగిందంటే.. కప్పాడ్ కు చెందిన నజీర్ కుమార్తె ఫాతిమా పొరుగింటిలో జరిగే పెళ్లికి వెళ్లింది. పెళ్లికి వెళుతూ.. బంగారు కంకణం, గొలుసు ధరించింది. పెళ్లి తర్వాత బాలిక దానిని పేపర్‌లో ప్యాక్ చేసి బుట్ట పైన ఉంచింది. ఆమె తన తల్లి షరీఫాకు చెప్పగా ఆమె ఆ విషయాన్ని మరచిపోయింది. అయితే, 10 రోజుల తర్వాత మరో బంధువు ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో కుటుంబ సభ్యులు కంకణం కోసం తనిఖీ చేశారు. ఆభరణాలు మాత్రం కనిపించలేదు.. ఇల్లు మొత్తం తనిఖీ చేశారు. అన్ని ప్రదేశాలను క్షుణ్ణంగా వెతకగా.. వారి ప్రాంగణంలో కొబ్బరి చెట్టు కింద ఉన్న వ్యర్థాల్లో గొలుసు దొరికింది.
ఇలా వెతుకుతున్న క్రమంలో కుటుంబసభ్యుడు ఒకరికి కొబ్బరి చెట్టు మీదున్న కాకి గూడు కనిపించింది.. కంకణం ఒకవేళ దానిలో ఉందేమోనన్న అనుమానం రావడంతో నజీర్ బంధువు అహ్మద్ కొబ్బరి చెట్టు ఎక్కాడు. కాకి గూడును పరిశీలించగా.. దానిలో కంకణం కనిపించింది. దీంతో పది రోజుల నుంచి నిద్రాహారాలు మానుకుని గోల్డ్ కోసం వెతుకుతున్న కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.
తాము పొగుట్టుకున్న గొలుసు, కంకణం ఇంటి ప్రాంగణంలోనే లభించడంతో కుటుంబం సంబరపడిపోయింది.. కాకి బంగారం ప్యాకెట్ ను ఎత్తుకుని పోయి ఉంటుందని.. ఆ తర్వాత గూడులో పెట్టిఉంటుందని కుటుంబసభ్యులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..