13 ఏళ్ల వయసులో పెళ్లి, 14ఏళ్లకు తల్లి.. నేడు బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌గా అఫ్గాన్‌ చిన్నారి పెళ్లి కూతురు..!

13 ఏళ్ల వయసులో వివాహం, 14 ఏళ్ల వయసులో తల్లి అయింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయిన ఒక అమ్మాయి బాడీబిల్డింగ్ ఛాంపియన్‌గా ఎదిగింది. ఈ మహిళ ఆఫ్ఘనిస్తాన్ నుండి ఎలా తప్పించుకుంది..? చివరకు బాడీబిల్డింగ్ ఛాంపియన్‌గా ఎలా గెలవగలిగింది..? ఆఫ్ఘనిస్తాన్‌లో అమ్మాయిలు స్వేచ్ఛను కోల్పోతున్న తరుణంలో రోయా కరిమి లాంటి మహిళలు ధైర్యానికి హద్దులు లేవని ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ఆమె కథేంటో ఇక్కడ చూద్దాం..

13 ఏళ్ల వయసులో పెళ్లి, 14ఏళ్లకు తల్లి.. నేడు బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌గా అఫ్గాన్‌ చిన్నారి పెళ్లి కూతురు..!
Bodybuilding Champion Roya Karimi

Updated on: Dec 28, 2025 | 6:25 PM

ప్రకాశవంతంగా వెలిగిపోతున్న లైట్ల కింద స్టేజ్‌పై నిలబడి, తన బలమైన, కండలు తిరిగిన శరీరాన్ని ప్రదర్శించినప్పుడు రోయా కరిమి కేవలం తన బాహుబలాన్ని ప్రదర్శింలేదు. తను చేసిన పోరాటం, బాధ, ధైర్యం కనిపించింది. ప్రస్తుతం 30 ఏళ్ల రోయా కరిమి ఆఫ్ఘనిస్తాన్‌లో జన్మించింది. అక్కడ అమ్మాయిలు ఆరవ తరగతి దాటి చదువుకోవడానికి అనుమతించరు. ఉద్యోగం అసలే చేయకూడదు. బహిరంగంగా బయటకు వెళ్ళే స్వేచ్ఛ కూడా లేదు. ఆఫ్ఘన్ సమాజంలో బాలికలకు ఎలాంటి హక్కులు లేవని తాను చిన్నప్పటి నుంచీ గ్రహించానని రోయా చెప్పింది. ఆమె 13 సంవత్సరాల వయసులో పాఠశాల విద్య పూర్తి చేసి, మరుసటి సంవత్సరం బలవంతంగా వివాహం చేసుకోవాల్సి వచ్చిందని చెప్పింది.

పెళ్లైన ఒక సంవత్సరంలోనే రోయా తల్లి అయ్యింది. ఆమె కుమారుడు ఎర్ఫాన్ కు నేడు 17 సంవత్సరాలు. చిన్న వయస్సు, భర్త, నవజాత శిశువు, సమాజంలోని కఠినమైన ఆంక్షలు ఏ టీనేజర్ ను అయినా సరే కుంగిపోయేలా చేస్తాయి. ఆ సమయంలో తాలిబన్లు అధికారంలో లేకపోయినా, వారు స్థాపించిన నియమాలు సమాజంలో లోతుగా పాతుకుపోయాయి. మనం స్వేచ్ఛగా జన్మించాము. కానీ, మీ స్వేచ్ఛను హరించడం వల్ల కలిగే బాధ నాకు తెలుసు అంటూ రోయా ఆవేదన వ్యక్తం చేశారు.

రోయా జీవితంలో ఒక మలుపు తిరిగింది. ఆమె తల్లి మహతాబ్ అమిరి ఆమెకు అండగా నిలిచింది. ఆమె ఆఫ్ఘనిస్తాన్ నుండి తప్పించుకోవడానికి ప్రణాళిక వేసుకుంది. రోయా, ఆమె కుమారుడు మొదట ఇరాన్, తరువాత టర్కీ, గ్రీస్, చివరకు నార్వేకు ప్రయాణించారు. అక్కడ వారు ఆశ్రయం పొందారు. అది భయానక సమయం, కానీ తనకు మరో మార్గం కనిపించలేదని రోయా చెప్పారు. కానీ, తన కొడుకు తన ప్రపంచంగా భావించింది. అలా నార్వేలో తొలినాళ్ళు చాలా కష్టాలు అనుభవించానని చెప్పింది. కొత్త భాష, కొత్త సంస్కృతి, పాత గాయాల భారం. కానీ, రోయా ధైర్యం కోల్పోలేదు. ఆమె తన నర్సింగ్ చదువును పూర్తి చేసింది. తన తల్లిలాగే వైద్య వృత్తి కొనసాగించింది. ఇక్కడే జిమ్, వ్యాయామం ఆమె జీవితంలోకి ప్రవేశించాయి.

ఇవి కూడా చదవండి

జిమ్‌కు వెళ్లడం అంటే కేవలం ఫిట్‌నెస్ గురించి మాత్రమే కాదు. మానసిక స్వస్థత గురించి కూడా అని రోయా వివరిస్తుంది. నిద్రలేమి, గాయాలు, భయం ఉన్నప్పటికీ, వ్యాయామాలు ఆమెను మానసికంగా, శారీరకంగా బలోపేతం చేశాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో జిమ్‌లు, బాడీబిల్డింగ్ వంటివి మహిళలకు ఏ మాత్రం అనుమతి లేనివి. కానీ, నార్వేలో ఇది సర్వసాధారణమని ఆమె చెప్పింది. అక్కడే ఆమె అనుభవజ్ఞుడైన బాడీబిల్డర్ కమల్ జలాలుద్దీన్‌ను కలిసింది. ఆ తరువాత అతన్నే వివాహం చేసుకుంది. అతడు ఆమె నిర్ణయాలకు అండగా నిలబడి, ముందుకు సాగేలా సహకరించాడని చెప్పింది.

రోయా ప్రొఫెషనల్ బాడీబిల్డింగ్ మొదలుపెట్టినపుడు తనకు ఆన్‌లైన్ బెదిరింపులు అనేకం వచ్చాయని చెప్పింది. చంపుతామని కూడా చాలా బెదిరింపులు వచ్చాయి. చాలా సార్లు ఆమె సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ చేయబడ్డాయి. మహిళలు బయటకు మాట్లాడటం, విద్యావంతులు, బలమైన మహిళలుగా ఎదగడం చాలా మందికి ఇష్టం ఉండదని, వారిని ఎదో ఒక రకంగా బెదిరింపులకు గురిచేస్తూ అణగదొక్కలని చూస్తారంటూ రోయా వాపోయింది. తను ఎదుర్కొన్న విమర్శకులను ఆమె తాలిబన్లతో పోల్చింది. వారు 2021లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై కఠినమైన చట్టాలను విధించారు.

గత మూడు సంవత్సరాలుగా రోయా కరిమి నార్వే, యూరప్, దుబాయ్‌లలో జరిగిన అనేక బాడీబిల్డింగ్ పోటీలలో విజయం సాధించింది. ఇప్పుడు, ఆమె లక్ష్యం వచ్చే ఏడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో పోటీ పడటం అని రోయాచెబుతుంది. ఆఫ్ఘన్ మహిళలు తమ సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు కలిగి ఉండాలని కోరుకుంటోంది. రోయా కరిమి నేడు కేవలం బాడీబిల్డర్ మాత్రమే కాదు, స్వేచ్ఛను కోల్పోయిన లక్షలాది మంది ఆఫ్ఘన్ అమ్మాయిల గొంతుకగా మారింది. వారిని ముందుకు సాగనివ్వండి, వారిని ఎదగనివ్వండి అంటూ కోరుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..