పిల్లలు స్వతహాగా చాలా అల్లరి చేస్తుంటారు. ఎప్పుడూ ఏదో ఒక ఆట ఆడుతూ తమ ప్రాణాలను రిస్క్‌లో పెడుతుంటారు. తల్లిదండ్రులు ఏదైనా చెబితే అస్సలు పట్టించుకోరు. దీనివల్ల ఒక్కోసారి తమకు తెలియని ప్రమాదకరమైన పనులు చేస్తుంటారు. పిల్లలు నీటి గుంతల్లో మునిగి చనిపోవడం, కాల్వలో కొట్టుకుపోవటం వంటి వార్తలను మీరు తరచుగా వింటుంటారు. ఈతకు వెళ్లిన చిన్నారులను మృత్యువు మింగేసింది.. అనే హెడెలైన్స్‌తో వచ్చే వార్తలు అందరినీ కలచివేస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అమాయక పిల్లలను రక్షించడానికి ఏదైనా చేయాలి అనే భావన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. అయితే ఏం చేయాలనేది అందరినీ వేధించే ప్రశ్న. కానీ, ప్రశ్న వద్దే ఆగిపోకుండా ఓ యువకుడు చొరవ తీసుకున్నాడు. అతడు చేసిన పని ఇప్పుడు సర్వత్రా ఆందోళనకు గురిచేసే పిల్లలు నీట మునిగిపోకుండా రక్షించడానికి గొప్ప మార్గానికి దారితీసింది. చిన్నారులు నీళ్లలో పడి మునిగిపోకుండా ఉండేందుకు ఈ యువకుడు ఓ ప్రత్యేకమైన టీషర్ట్‌ను రూపొందించాడు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రాకు ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది. యువకుడు తయారు చేసిన ఈ ప్రత్యేకమైన టీ-షర్టు వీడియోను ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసాడు.
చెరువుల్లో, నదుల్లో ఈతకని వెళ్లి చనిపోయేవారిని కాపాడేందుకు ఈ ఆవిష్కరణ రెడీ అయిందని పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్ర ట్వీట్ చేశారు. ఈ టీ-షర్ట్ ధరించి నీళ్లల్లోకి దిగిన వెంటనే.. షర్ట్ కాస్తా- లైఫ్ జాకెట్‌గా మారిపోతుంది. మన ప్రాణాలను కాపాడుతుంది. ఈ ఆవిష్కరణను చూసిన ఆనంద్ మహింద్ర- దీనికి నోబెల్ పురస్కారం దక్కదుగానీ, తన దృష్టిలో అంతకంటే ఎక్కువే అంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు.
కేవలం1 నిమిషం1 సెకను నిడివి గల ఈ వీడియోలో ఒక యువకుడు… గాలితో కూడిన టీ-షర్ట్‌ని డిజైన్ చేసి, దానిని డెమో చేస్తున్నాడు. ఈసారి నీళ్లతో నిండిన చతురస్రాకారపు ట్యాంక్ ముందు అతడు నిలబడి ఉన్నాడు. ఒక బాలుడి డమ్మీ బొమ్మను తీసుకుని దానికి టీ షర్టును తొడిగించాడు. ఆ తర్వాత ఆ బొమ్మను నీటిలో పడవేశాడు. ఆ తర్వాత జరిగింది మ్యాజిక్ అనే చెప్పాలి. ఎందుకంటే..ఆ బాలుడి బొమ్మ నీళ్లలో పడగానే అది మునిగిపోలేదు. బదులు నీటిపై తేలుతుంది. ఎందుకంటే టీ-షర్టు కాలర్‌లో నీటిలో మునిగినప్పుడు వెంటనే తెరుచుకునే పరికరం అమర్చబడి ఉంది. ఆ పరికరమే నీళ్లలో పడ్డవారిని మునిగిపోకుండా కాపాడుతుంది. పిల్లల భద్రత కోసం ఇది చాలా ఉపయోగకరమైన జాకెట్. ఇది ధరించడం ద్వారా, పిల్లవాడు లోతైన నీటిలో పడినప్పటికీ మునిగిపోడు.
This may not get a Nobel prize but it ranks higher than those inventions for me. Because as the grandfather of two young kids, their wellbeing & safety is my highest priority. ?????? (video credit: @Rainmaker1973 ) pic.twitter.com/ZaSyVMqZG9
— anand mahindra (@anandmahindra) May 25, 2023
యూనిక్ టీషర్ట్ డెమో క్లిప్ చూసి సోషల్ మీడియా యూజర్లు యువకుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది చాలా ఉపయోగకరమైన విషయం అని ఒక వినియోగదారు ప్రశంసించారు. ఈ ఆవిష్కరణతో పిల్లలు మునిగిపోకుండా కాపాడుకోవచ్చని, సులభంగా ఈత నేర్చుకోవచ్చని మరో వినియోగదారు తెలిపారు. ఈ వీడియోకి ఇప్పటివరకు 9 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో పాటు 12 వేల మందికి పైగా లైక్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..