అది థానేలోని షాపూర్ జాతీయ రహదారి. అటుగా వెళ్తున్న వాహనదారులకు ఓ షాకింగ్ ఇన్సిడెంట్ కనిపించింది. హైవే పక్కనే ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పూర్తి నగ్నంగా పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల అనంతరం స్పృహలోకి వచ్చిన ఆ వ్యక్తి చెప్పిన షాకింగ్ నిజం విని.. పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది. ఇంతకీ అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందామా..
వివరాల్లోకి వెళ్తే.. షాపూర్‌కు చెందిన బాలాజీ శివభగత్ అనే వ్యక్తి స్థానికంగా కన్‌స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్నాడు. ఇక అతడు కొంతకాలంగా భవిక అనే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమె కోరిందల్లా కొనిపెట్టాడు. ఇల్లు కట్టించాడు, కారు కొన్నాడు. ఈ క్రమంలోనే గత నెల 28న భవిక నుంచి కలుద్దామని ఫోన్ రావడంతో బాలాజీ ఆనందంతో ఉబ్బితబ్బిబై.. ఆమె చెప్పిన ప్లేస్‌కు వచ్చాడు. అది షాపూర్ హైవే సమీపంలో ఉంది. అక్కడ ఆమె కారులో కూర్చుని ఉండగా.. తనతో తీసుకొచ్చిన బంగారు గాజులు, చెవి దుద్దులు, పట్టు చీరను భవికకు బహుమతిగా ఇచ్చాడు బాలాజీ. అయితే ఈలోగా నలుగురు వ్యక్తులు వచ్చి బాలాజీని కొట్టడం ప్రారంభించారు. అతడ్ని కిడ్నాప్ చేసి స్థానికంగా ఉన్న ఓ ఖాళీ రెస్టారెంట్‌కు తీసుకెళ్ళి చిత్రహింసలు చేశారు. అనంతరం అతడి ఒంటిపై ఉన్న బంగారు నగల్ని దోచేశాడు.
ఆ నలుగురు వ్యక్తులు బాలాజీ ఒంటిపై ఉన్న బట్టలు తొలగించి.. అతడ్ని పూర్తి నగ్నంగా మార్చి వీడియోలు, ఫోటోలు తీశారు. అనంతరం అతడి కళ్లల్లో కారం చల్లి.. తీసుకొచ్చి రోడ్డుపై పడేశారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు బాలాజీ. ఇక ఆ తర్వాత రోజు అటుగా వెళ్తున్న కొంతమంది అతడ్ని చూసి పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. కాగా, బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం భవిక పరారీ ఉన్నట్లు సమాచారం. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.