
అవతల ఉంది ఎంత బలమైన జీవి అయినా సరై.. చిరుత వెంటాడి పంజా విసిరితే ప్రాణాలు పోవాల్సిందే. దాని వేగం, వడుపు అలాంటివి మరి. అలాంటి చిరుత బోనులో దూడను చూసి వింతగా ప్రవర్తించింది. దానిని వేటాడకుండా.. పక్కనే నిశ్శబ్దంగా కూర్చుంది. కర్ణాటకలోని మైసూరు జిల్లా హెగ్గడదేవనకోటె పరిసరాల్లో చిరుత సంచరిస్తోందని స్థానికుల ఫిర్యాదులు రావడంతో అటవీ అధికారులు బోను ఏర్పాటు చేశారు. అందులో ఎరగా ఒక లేగదూడను ఉంచారు.
ఆహార వేటలో తిరుగుతూ వచ్చిన చిరుత బోనులో పడింది. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ.. దూడపై దాడి చేయకుండా దాని పక్కనే గడిపింది. గురువారం ఉదయం అటవీ సిబ్బంది బోను వద్దకు చేరుకున్నప్పుడు.. దూడ ప్రశాంతంగా గడ్డి తింటూ కనిపించగా.. చిరుత ప్రశాంతంగా కూర్చున్న దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. అనంతరం దూడను సురక్షితంగా బయటకు తీసి, చిరుతకు మత్తుమందు ఇచ్చి అటవీ ప్రాంతానికి తరలించారు. బహుశా అది కొంత సమయం ముందే ఏదైనా తిని.. ఆకలితో ఉండకపోవచ్చు అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. లేదా దానికి సుస్తి చేసి ఉండవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.