
Karnataka : దేశవ్యాప్తంగా చాలా వరకు విద్యార్థులకు 10వ తరగతి , ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇక అందరూ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తు్న్నారు. ఇకపోతే, పదో తరగతి అంటేనే.. ప్రతీ విద్యార్థి జీవితంలో తొలి మైలురాయి. దీనిని అధిగమించేందుకు విద్యార్థులు కష్టపడి చదువుతారు. అయితే, కొందరు విద్యార్థులు మాత్రం చదవలేక కాపీ కొట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. మరికొందరు ఉపాధ్యాయులను, పరీక్ష పత్రాలు దిద్దే వారిని కాకపట్టే ప్రయత్నం కూడా చేస్తుంటారు. మరికొందరు పరీక్షలో ఇచ్చిన ప్రశ్నలకు జవాబు పత్రాలపై వింత వింత సమాధానాలు రాస్తుంటారు. కొందరు సినిమా పాటలు రాస్తుంటారు. మరికొందరు ఇష్టదైవాల పేర్లు కూడా రాస్తుంటారు. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వార్త అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది. ఎందుకంటే.. ఇక్కడ విద్యార్థులు ఏకంగా తమను పాస్ చేయాలంటూ లంచం ఆఫర్ చేశారు.
అవును మీరు చదివింది నిజమే.. కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని చిక్కోడిలో (SSLC)10వ తరగతి పరీక్షల సమాధాన పత్రాలలో ఉపాధ్యాయులకు వింత సమాధానాలు కనిపించాయి. 10వ తరగతి పరీక్ష సమాధాన పత్రంలో కనిపించింది చూసి వారంతా షాక్ అయ్యారు. విద్యార్థులను పాస్ చేయడానికి ఉపాధ్యాయులకు డబ్బు ఆఫర్ చేశారు. విద్యార్థుల డిమాండ్లు రూ. 500లతో జతపర్చిన జవాబు పత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
కర్ణాటకలో 10వ తరగతి పరీక్ష మార్చి 3 నుండి మార్చి 26 వరకు జరిగాయి.. ఈ పరీక్షకు 4.27 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. మే మొదటి వారంలో పరీక్షా ఫలితాలను ప్రకటిస్తామని పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. ఈ క్రమంలోనే పదో తరగతి పరీక్షల మూల్యాంకనం చివరి దశకు చేరుకున్న సమయంలో,విద్యార్థుల వింత డిమాండ్లు వెలుగులోకి వచ్చాయి.
పరీక్షలో సమాధానాలకు బదులుగా కొందరు విద్యార్థులు ఇలా రాశారు..‘‘సార్, దయచేసి నన్ను పాస్ చేయండి, ఈ రూ.500 తీసుకోండి’’, ‘‘నా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది’’, ‘‘పాస్ చేయకపోతే తల్లిదండ్రులు కాలేజీకి పంపరు’’ వంటి అభ్యర్థనలు రాశారు.
మరో విద్యార్థి వింతగా.. ‘నా ప్రేమ మీరు వేసే మార్కుల మీదే ఆధారపడి ఉంది’ అని, ‘నేను పాసైతేనే నా ప్రేమను కొనసాగిస్తాను’ అంటూ తన సమాధాన పత్రంలో రాయడం సోషల్ మీడియాలో హాస్యాస్పదంగా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన ఒక ఆన్సర్ షీట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడమే కాక, విద్యార్థుల మనస్తత్వం, పరీక్షల ఒత్తిడిపై చర్చకు దారితీసింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..