గోవా నుంచి ఫ్లైట్‌లో ఎంత మద్యం తీసుకరావొచ్చు..? ఎక్కువ తెస్తే ఏమవుతుంది…
గోవా లాంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు తమకు ఇష్టమైన బ్రాండ్ ఆల్కహాల్‌ను వెంట తెచ్చుకోవాలని చాలామంది భావిస్తుంటారు. మన దేశంలోని దేశీయ విమానాల్లో మద్యం తీసుకెళ్లేందుకు అనుమతి ఉన్నప్పటికీ, ఏవియేషన్ నిబంధనల ప్రకారం లీటర్ల పరిమితి, ఆల్కహాల్ శాతం, ప్యాకింగ్ విధానంపై కొన్ని స్పష్టమైన ఆంక్షలు ఉన్నాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

గోవా టూర్ ముగించుకుని తిరిగి వస్తూ అక్కడి ఫేమస్ వైన్ బాటిల్ తీసుకురావాలన్నా, ఇతర ప్రాంతాల నుంచి మీకు ఇష్టమైన బ్రాండ్ ఆల్కహాల్‌ను విమానంలో తీసుకెళ్లాలన్నా కొన్ని ఖచ్చితమైన విమానయాన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. భారతదేశంలోని దేశీయ విమానాల్లో మద్యం తీసుకెళ్లడానికి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అనుమతి ఉన్నప్పటికీ.. పరిమితులు, ఆల్కహాల్ శాతం, లగేజీ కేటాయింపులపై కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయి.
ఆల్కహాల్ శాతం – అనుమతించే పరిమితులు
విమానంలో ప్రయాణికులు మద్యం తీసుకెళ్లేందుకు నిర్దిష్ట పరిమితులు ఉన్నాయి.
24 నుండి 70శాతం వరకు ఆల్కహాల్: విస్కీ, రమ్, వోడ్కా, బ్రాందీ వంటి 24 నుంచి 70శాతం వరకు ఆల్కహాల్ శాతం ఉన్న లిక్కర్‌ను ఒక్కో ప్రయాణికుడు గరిష్ఠంగా 5 లీటర్ల వరకు తీసుకెళ్లవచ్చు.
24శాతం కంటే తక్కువ ఆల్కహాల్: బీర్, వైన్ వంటి పానీయాల్లో ఆల్కహాల్ 24శాతం కంటే తక్కువ ఉంటే 5 లీటర్ల పరిమితి వర్తించదు. అయితే ఎయిర్‌లైన్స్ విధించే సాధారణ బ్యాగేజీ బరువు పరిమితికి లోబడి మాత్రమే వీటిని తీసుకెళ్లాలి. బరువు పరిమితి దాటితే ఎక్సెస్ బ్యాగేజీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
70శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్: 70శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్ గాఢత కలిగిన ద్రవాలను మండే స్వభావం కలవిగా పరిగణించి విమానాల్లోకి తీసుకెళ్లడంపై పూర్తి నిషేధం విధించారు.
చెక్-ఇన్ బ్యాగేజీ తప్పనిసరి.. హ్యాండ్ బ్యాగ్‌లకు నో
దేశీయ విమానాల్లో మద్యం బాటిళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ క్యాబిన్ బ్యాగ్ లేదా హ్యాండ్ లగేజీలో అనుమతించరు.
చెక్ ఇన్ బ్యాగేజీలోనే భద్రపరచాలి: లిక్కర్ బాటిళ్లను బట్టల మధ్య పగలకుండా సురక్షితంగా ప్యాక్ చేసి చెక్-ఇన్ బ్యాగేజీలోనే వేయాలి.
మినహాయింపులు: ఇండిగో, ఆకాశా ఎయిర్ వంటి కొన్ని విమానయాన సంస్థలు సెక్యూరిటీ చెకింగ్ పూర్తయ్యాక సెక్యూరిటీ హోల్డ్ ఏరియాలో కొనుగోలు చేసిన ఒక లీటరు వరకు మద్యాన్ని నిబంధనల ప్రకారం హ్యాండ్ బ్యాగ్‌లో అనుమతిస్తాయి.
డొమెస్టిక్ డ్యూటీ ఫ్రీ లేదా విమానాశ్రయంలో కొనుగోలు చేసినా నిబంధనలను బట్టి చాలా సందర్భాల్లో చెక్ ఇన్ బ్యాగేజీలోనే ఉంచాల్సి ఉంటుంది.
సీల్ ఓపెన్ అయితే నో ఎంట్రీ
అసలు ప్యాకింగ్ తప్పనిసరి: మద్యం బాటిళ్లు కొనుగోలు చేసిన అసలు సీసాలోనే ఉండాలి, తయారీదారుల అధికారిక సీల్ చెక్కుచెదరకుండా ఉండాలి.
సగం తాగిన సీసాలు నిషిద్ధం: సగం తాగినవి, మూత తెరిచిన సీసాలు, అలాగే లగేజీలో స్థలం కోసం ప్లాస్టిక్ బాటిళ్లలోకి మార్చిన మద్యాన్ని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకుంటారు. బాటిల్ పరిమాణం 5 లీటర్లకు మించకూడదు.
కనెక్టింగ్ ఫ్లైట్లలో ప్రయాణించే వారు ఏం చేయాలి?
విదేశాల నుంచి అంతర్జాతీయ విమానంలో భారత్‌కు చేరుకుని, అక్కడి నుంచి మరో డొమెస్టిక్ ఫ్లైట్‌కు మారే ప్రయాణికులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇంటర్నేషనల్ టెర్మినల్ నుండి డొమెస్టిక్ టెర్మినల్‌కు వెళ్లేటప్పుడు హ్యాండ్ బ్యాగ్‌లోని డ్యూటీ ఫ్రీ మద్యాన్ని తిరిగి చెక్-ఇన్ బ్యాగేజీలోకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఎయిర్‌పోర్టులు, ఎయిర్‌లైన్స్ నిబంధనలను బట్టి అనుమతులు మారే అవకాశం ఉన్నందున, బయలుదేరే ముందే సంబంధిత విమానయాన సంస్థ మార్గదర్శకాలను సరిచూసుకోవడం ప్రయాణానికి సురక్షితం.
