
చదువుకోవాలనే ఆ పిల్లవాడి కోరిక ముందు, కొడుకును గొప్ప ప్రయోజకుడిని చేయాలనే ఆ తండ్రి సంకల్పం ముందు ప్రకృతి సృష్టించిన బీభత్సం కూడా చిన్నబోయింది. కానీ ఆ తండ్రి చేసిన ప్రయాణం చూస్తే మాత్రం ఎవరైన షాక్ అవడం ఖాయం. ఉధృతంగా ప్రవహిస్తున్న నది, క్షణక్షణం పెరుగుతున్న నీటి మట్టం.. వీటన్నింటినీ దాటుకుంటూ ఒక తండ్రి తన ప్రాణాల కంటే ఎక్కువైన కొడుకును భుజాలపై కూర్చోబెట్టుకుని నది దాటిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా, నేటికీ ఒక చిన్నారి బడికి వెళ్లడానికి ఇంతటి సాహసం చేయాలా? అంటూ నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.
బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా బగహా ప్రాంతంలోని డోన్ రీజియన్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతం చుట్టూ దాదాపు 22 చిన్న, పెద్ద నదులు ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ ప్రాంతానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. రోడ్లు, విద్యుత్, వైద్యం, కనీసం దాటడానికి ఒక వంతెన వంటి కనీస మౌలిక సదుపాయాలు ఇక్కడ శూన్యం అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో నది ప్రవాహం ఎంత వేగంగా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. తండ్రి తన బిడ్డను భుజాలపై వేసుకుని నీటిలో నెమ్మదిగా ముందుకు సాగుతుండగా, ప్రమాదాన్ని గమనించిన స్థానికులు కొందరు నీటిలోకి దిగి వారికి ఆసరాగా నిలిచారు. ఎవరైనా అనారోగ్యం బారిన పడినా, లేదా పిల్లలు బడికి వెళ్లాలన్నా ఇక్కడి ప్రజలు ప్రతిరోజూ చావుతో పోరాడాల్సిందే.
వరద భీభత్సాన్ని చూసి ఆ తండ్రి వెనకడుగు వేయలేదు. తన కొడుకు బాగా చదువుకుని, సమాజంలో మంచి స్థాయికి చేరాలనేదే ఆ తండ్రి ఆశయం. అందుకే మృత్యువు కళ్లముందు కనిపిస్తున్నా కొడుకు భవిష్యత్తు కోసం ఆ ప్రమాదకర నదిని దాటాడు. ‘‘ప్రభుత్వం గనుక ఇక్కడ సకాలంలో ఒక శాశ్వత వంతెన నిర్మించి ఉంటే, ఈ రోజు ఒక అమాయక బాలుడు, అతని తండ్రి బడికి వెళ్లడం కోసం ఇలా ప్రాణాలను పణంగా పెట్టాల్సిన అవసరం వచ్చేది కాదు’’ అని స్థానిక గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ తండ్రి ప్రేమానురాగాలకు సలాం కొడుతూనే, స్థానిక యంత్రాంగం, ప్రభుత్వాల నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్కడ వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.