మాములుగా ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి ఇంట్లో ఎంత నగదు ఉంటుంది చెప్పండి. మహా అయితే 2, 3 లక్షల వరకు ఉండొచ్చు. ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి వస్తే ఉపయోగపడుతుందని ఆ మాత్రం అట్టి పెట్టుకుంటారు. మిగతా డబ్బు బ్యాంకులో వేయడమో, వడ్డీలకు ఇవ్వడమో చేస్తుంటారు. అయితే స్లమ్ ఏరియా అంటే మురికివాడలో ఉండేవారి వద్ద డబ్బు ఎంత ఉంటుంది అంటే.. లక్ష రూపాయల లోపలే అని చెప్పవచ్చు. ఎందుకుంటే వారి ఆదాయ వనరలు తక్కువగా ఉంటాయి కాబట్టి. కానీ మురికివాడలో ఓ ఇరుకు ఇంట్లోని ఓ పాత ట్రంకు పెట్టెలో లక్షలు నగదుతో పాటు విలువైన ఆభరణాలు ఉంటే.. పక్కాగా డౌట్ వస్తుంది. హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్ పోలీసులు అలాంటి సందర్భాన్నే ఎదుర్కొన్నారు.
నగరంలో డ్రగ్స్ ముఠా యాక్టివ్‌గా ఉందని, ఎవరికీ అనుమానం రాకుండా మురికివాడల గుండా ఈ దందా నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సెక్టార్-10లోని మురికివాడల్లో పెద్దఎత్తున గంజాయి, ఇతర మత్తు పదార్థాలు దాచినట్లు రహస్య వర్గాలు ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీనిపై సెక్టార్-10 పోలీసులతో పాటు క్రైం బ్రాంచ్ పోలీసులు.. జాయింట్ ఆపరేషన్ చేశారు. స్లమ్ ఏరియాల్లో ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడిలో పోలీసు మురికివాడలోని ఓ మహిళ ఇంటిలో ఓ మూలన ఉన్న ట్రంక్ పెట్టెను ఓపెన్ చేయగా భారీగా క్యాష్ లభ్యమైంది. 12 లక్షల 80 వేల రూపాయల నగదుతో పాటు సుమారు నాలుగున్నర కిలోల వెండి ఆభరణాలు, కొన్ని బంగారు ఆభరణాలు కూడా అందులో ఉన్నాయి. దుస్తులు ఉంచే ట్రంకు పెట్టెలో నగదు దాచి ఉంచారు. పోలీసులు ఆ ఇంట్లోని వ్యక్తులను అదుపులోకి తీసుకుని CRPF సెక్షన్ 102 కింద చర్యలు ప్రారంభించారు.
ప్రస్తుతం ఆ ఇంట్లో నివాసం ఉంటున్న మహిళను విచారిస్తున్నారు. ఆ మహిళకు ఇంత పెద్ద మొత్తంలో నగదు, నగలు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విచారణలో వాస్తవాలు వెల్లడైన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.