
సాధారణంగా ఉడుతలు అంటే అమాయకత్వానికి, చురుకుదనానికి చిహ్నంగా భావిస్తాం. కానీ, రాజస్థాన్‌లోని ఒక ఉడుత మాత్రం ఇప్పుడు అందరినీ గజగజ వణికిస్తోంది. ఉదయపూర్‌లోని ప్రసిద్ధ మోహన్‌లాల్ సుఖాడియా విశ్వవిద్యాలయం (MLSU) క్యాంపస్‌లో ఒక ఉడుత గత కొన్ని రోజులుగా సీరియల్ అటాకర్‌గా మారింది. ఏకంగా 20 మందిని కరిచి గాయపరచడంతో విద్యార్థులు, ప్రొఫెసర్లు అటుగా వెళ్లాలంటేనే భయపడుతున్నారు.
ఈ వింత ఘటన ఆర్ట్స్ కాలేజీలోని సైకాలజీ విభాగం వద్ద జరుగుతోంది. అక్కడ ఉన్న ఒక చెట్టు మీది నుండి ఈ ఉడుత మెరుపు వేగంతో వచ్చి అటుగా వెళ్లే వారిపై దాడి చేస్తోంది. కేవలం విద్యార్థులే కాకుండా, కళాశాల డీన్‌పై కూడా ఇది దాడి చేసి గాయపరిచింది. ఇప్పటివరకు సుమారు 18 నుంచి 20 మంది దీని బారిన పడ్డారు. ఈ ఉడుత దాడి చేసే విధానం చాలా విచిత్రంగా ఉందని బాధితులు చెబుతున్నారు. అది ఎప్పుడు, ఎలా వస్తుందో తెలియదు.. ఒక్కసారిగా వచ్చి కరిచి క్షణాల్లో మళ్లీ చెట్టుపైకి వెళ్లి దాక్కుంటోంది.
ఈ ఉడుత ఆగడాలు ఎక్కువవ్వడంతో యూనివర్సిటీ అధికారులు అటవీ శాఖను ఆశ్రయించారు. రెస్క్యూ టీమ్ వచ్చి ఉడుతను పట్టుకోవడానికి బోన్లు ఏర్పాటు చేసినా, అది మాత్రం చిక్కడం లేదు. ఇది చాలా తెలివిగా తప్పించుకుంటోందని సిబ్బంది చెబుతున్నారు. దీంతో అటుగా వెళ్లే విద్యార్థులు తమ రక్షణ కోసం చేతిలో కర్రలు పట్టుకుని నడుస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
मोहनलाल सुखाड़िया यूनिवर्सिटी गिलहरी का आतंक
राजस्थान में मोहनलाल सुखाड़िया यूनिवर्सिटी के आर्ट्स कॉलेज में एक गिलहरी ने आतंक मचा रखा है. अब तक उसने 18 से 20 स्टूडेंट्स और स्टाफ को काट लिया है.रेस्क्यू टीम के गिलहरी को पकड़ने में पसीने छूट गए है.#Rajasthan #Squirrel #udaipur pic.twitter.com/Czg3Rv6Ju4
— NDTV Rajasthan (@NDTV_Rajasthan) April 30, 2026
జంతు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉడుత ఇలా ప్రవర్తించడానికి కొన్ని కారణాలు ఉండవచ్చు. సాధారణంగా తన గూడులో పిల్లలు ఉన్నప్పుడు వాటి రక్షణ కోసం ఉడుతలు దూకుడుగా ప్రవర్తిస్తాయి. లేదా ఏదైనా ప్రత్యేకమైన రంగులను చూసి అది అసహనానికి లోనవుతూ ఉండవచ్చు. పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందిస్తూ.. ఉడుత కరిస్తే రేబిస్ ప్రమాదం ఉండదని, కానీ జాగ్రత్తగా టెటనస్ (ధనుర్వాతం) ఇంజక్షన్ తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ గ్యాంగ్‌స్టర్ ఉడుతకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…