
సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించే సముద్రపు తేలియాడే నగరాలు త్వరలోనే నిజం కాబోతున్నాయి. అమెరికాకు చెందిన ఫ్రీడమ్ క్రూయిజ్ లైన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద నివాస నౌక ఫ్రీడమ్ షిప్ (Freedom Ship) నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. దాదాపు 16 బిలియన్ డాలర్ల (సుమారు ఒక లక్ష కోట్ల రూపాయల పైమాట) భారీ బడ్జెట్‌తో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్ట్, మానవ చరిత్రలోనే అత్యంత భారీ ఇంజనీరింగ్ అద్భుతంగా నిలవనుంది.
ఫ్రీడమ్ షిప్ అనేది సాధారణ విహార నౌక (Cruise Ship) కాదు, ఇది సముద్రంపై నిరంతరం ప్రయాణించే ఒక స్వయంసమృద్ధ నగరం. ఈ నౌక పొడవు 1.3 కిలోమీటర్లు (దాదాపు ఒక మైలు), ఎత్తు 25 అంతస్తులు ఉంటుంది. ప్రస్తుత ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ అయిన ఐకాన్ ఆఫ్ ది సీస్ కంటే ఇది దాదాపు ఎనిమిది రెట్లు పెద్దదిగా ఉండబోతోంది. ఇందులో 50,000 శాశ్వత నివాస గృహాలతో పాటు హోటళ్లు, క్యాసినోలు కూడా నిర్మిస్తారు. ఈ నౌకలో ఏకకాలంలో 50,000 మంది నివాసితులు, 30,000 మంది సందర్శకులు, సిబ్బందితో కలిపి మొత్తం 80,000 మంది సులభంగా నివసించవచ్చు.
ఈ ప్రాజెక్ట్ అత్యంత ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే, ఈ ఓడ పైకప్పు (Roof) పై చిన్న వాణిజ్య, ప్రైవేట్ విమానాలు ల్యాండ్ అవ్వడానికి వీలుగా ఒక రన్‌వే కలిగిన విమానాశ్రయం ఉంటుంది. దీని ద్వారా నివాసితులు ప్రపంచంలోని ఏ దేశానికైనా సులభంగా ప్రయాణించవచ్చు.
ఇక, ఈ ఓడలోని వసతులు చూస్తే.. ఒక ఆధునిక నగరంలో ఉండే అన్ని సౌకర్యాలు ఈ ఓడలోనే అందుబాటులో ఉంటాయి. పిల్లల కోసం అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు, కళాశాలలు నిర్మించనున్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన భారీ ఆసుపత్రి. 15,000 సీట్ల సామర్థ్యం గల స్పోర్ట్స్ స్టేడియం, షాపింగ్ మాల్స్, థియేటర్లు. ఓడ లోపల తిరగడానికి 15 మైళ్ల పొడవైన వాక్‌వేస్, అంతర్గత ట్రామ్ (Tram) వ్యవస్థతను ఏర్పాటు చేయనున్నారు.
న్యూక్లియర్ ఎనర్జీతో నడిచే ఈ సూపర్ షిప్ అంతర్జాతీయ జలాల్లో ఉంటూ ప్రతి రెండేళ్లకు ఒకసారి ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఇది ఏ దేశ ఓడరేవులోనూ ఆగదు, ఎందుకంటే దీని పరిమాణం చాలా పెద్దది. ప్రయాణికులు ఫెర్రీలు లేదా విమానాల ద్వారా సమీప దేశాల తీరాలకు చేరుకోవచ్చు.
1990లలోనే ఇంజనీర్ నార్మన్ నిక్సన్ ఈ ఆలోచన చేసినప్పటికీ, నిధులు, సాంకేతిక సవాళ్ల కారణంగా ఇప్పటివరకు ఇది కార్యరూపందాల్చలేదు. అయితే, ఈ ప్రాజెక్ట్ గనుక పూర్తయితే సముద్రంపై మానవ జీవన విధానంలో ఇదొక నూతన శకానికి నాంది పలకడం ఖాయం.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..