ఎలక్ట్రిక్ బైక్.. ఇప్పుడు ఎక్కడ చూసినా వీటి జోరు కొనసాగుతోంది. పెట్రోల్ ధరలు కొండెక్కి కూర్చోవడంతో కొత్తగా వాహనాలు కొనాలనుకునేవారికి.. ఈవీలే బెటర్ ఆప్షన్‌గా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడొక చిక్కొచ్చిపడింది.. ఎంతో ఇష్టపడి ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తుంటే.. తీరా అవి కాస్తా..! డైలాగ్ నేను కంప్లీట్ చేయడం ఎందుకు లెండి.. స్టోరీ చదవితే మీకే అర్ధమవుతుంది.
ఇప్పుడంతా ట్రెండ్ మారింది. పెట్రోల్, డీజిల్ రేట్ల మంటతో ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీ పెరుగుతూపోతోంది. ప్రభుత్వాలు కూడా ఈవీ వాహనాలనే ప్రోత్సహిస్తున్నాయి. దాంతో చాలామంది ఇప్పుడిప్పుడే ఈ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ప్రమాదాలకు ఈవీ వెహికిల్స్ కూడా మినహాయింపు ఏం కాదని నిరూపిస్తున్నాయి. కారణాలేమైనప్పటికీ కాలి బూడిద అవుతున్నాయి.. ప్రాణాలు కూడా తీస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ముంబైలోని అంధేరీ ప్రాంతంలో ఓ ఎలక్ట్రిక్ బైకులో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. దాంతో బ్యాటరీ నుంచి మంటలు రావడాన్ని గుర్తించిన ఆ బైక్ యజమాని వెంటనే ఆపి దిగిపోయాడు. అది వెనువెంటనే.. భీకర పొగలను కక్కుతూ.. మంటలు రావడంతో అందరూ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం తప్పినప్పటికీ.. ఎలక్ట్రిక్ వాహనం కూడా ప్రమాదమేనని భావిస్తున్నారు.
బ్యాటరీ స్టాండర్డ్‌ది కాదా.. లేక మితిమీరిన ఛార్జింగ్ చేశారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా.. ఎలక్ట్రిక్ వాహనం ఇలా మంటల్లో కాలిపోవడాన్ని చూసి.. వామ్మో ఏ వాహనాలు కొనాలిరా బాబూ అంటూ జనం అవాక్కయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఇది పాత వీడియో అయినప్పటికీ.. ఇటీవల వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్న నేపధ్యంలో పైన పేర్కొన్న వీడియో మరోసారి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.