Viral: పదేళ్ల పాటు హెర్బల్ స్కిన్ క్రీమ్ వాడిన మహిళ.. కట్ చేస్తే.. శరీరమంతా పాము మాదిరిగా..

దశాబ్దం పాటు వాడిన చర్మ క్రీమ్‌ కారణంగా ఒక మహిళ జీవితం తలకిందులు అయిపోయింది. చైనాలోని నాంజింగ్‌కు చెందిన టింగ్‌టింగ్‌ అనే మహిళ “ప్యూర్ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్” అని నమ్మి పదేళ్లుగా క్రీమ్‌ వాడింది. చివరికి ఆమె శరీరమంతా ఊదారంగులో పాము మాదిరిగా మార్పు చెందింది.

Viral: పదేళ్ల పాటు హెర్బల్ స్కిన్ క్రీమ్ వాడిన మహిళ.. కట్ చేస్తే.. శరీరమంతా పాము మాదిరిగా..
Snake Like Skin

Updated on: Nov 08, 2025 | 3:37 PM

చైనాకు చెందిన 40 ఏళ్ల మహిళ ఒకరు దశాబ్దం పాటు వాడిన స్కిన్ క్రీమ్‌ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. నాంజింగ్‌లోని జాంగ్డా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఈ మహిళను ‘టింగ్‌టింగ్’ అనే పేరుతో పిలుస్తున్నారు. ప్యూర్ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ పేరుతో ఆన్‌లైన్‌లో దొరుకుతున్న క్రీమ్‌ను పదేళ్లుగా నిరంతరంగా వాడిన ఆమె శరీరమంతా ఊదారంగులోకి మారి పాము మాదిరిగా అయిపోయింది.

హాస్పిటల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. టింగ్‌టింగ్ ఎప్పుడూ డాక్టర్‌ సలహా తీసుకోలేదు. తనకు తానే మందులు వేసుకుంటూ దాదాపు 10 ఏళ్లుగా ఆ క్రీమ్ వాడుతూ వచ్చింది. ఆసుపత్రిలో చేరే సమయానికి ఆమె చర్మంపై ఊదారంగు గీతలు, కాళ్ల వాపు, వాంతులు, చేతులు సత్తువ లేకపోవడం, రక్తపోటు పెరగడం వంటి సమస్యలు కనిపించాయి.

దాదాపు పదేళ్ల క్రితం కుడి కాలి కింది భాగంలో ఎరుపు మచ్చలు, మంట మొదలయ్యాయని టింగ్‌టింగ్ తెలిపింది. ఆ మంట తగ్గించుకునేందుకు ఆన్‌లైన్‌లో “అన్ని చర్మ వ్యాధులను నయం చేసే ప్యూర్ హెర్బల్ క్రీమ్” అంటూ ప్రచారం చేస్తున్న ఓ ప్రొడక్ట్‌ను కొనుగోలు చేసింది. మొదట వాడినప్పుడు మంట, దద్దుర్లు తగ్గడంతో నిజంగా ఇది పని చేస్తోందని నమ్మింది. కానీ ఆ తాత్కాలిక ఉపశమనం తర్వాత క్రమంగా ఆరోగ్యం క్షీణించింది.

ఆ క్రీమ్ కోసం ఆమె దాదాపు 1 లక్ష యువాన్లు (సుమారు 14 వేల అమెరికన్ డాలర్లు) ఖర్చు చేసినట్లు తెలిపారు. చివరికి నాంజింగ్ జాంగ్డా హాస్పిటల్‌లో చేరినప్పుడు ఆమె శరీరమంతా పాము మాదిరిగా ఊదా రంగు గీతలతో నిండిపోయింది. డయగ్నస్టిక్‌ పరీక్షల తర్వాత స్కిన్ స్పెషలిస్ట్ డా. వాంగ్ ఫే.. ఆమె శరీరంలో కార్టిసోల్ హార్మోన్‌ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీనివల్ల ‘సెకండరీ అడ్రినోకార్టికల్ ఇన్‌సఫిషెన్సీ’ అనే అరుదైన హార్మోన్‌ లోప వ్యాధికి గురైనట్లు వెల్లడించారు.

ప్రస్తుతం చికిత్సతో ఆమె పరిస్థితి కొంత మెరుగుపడుతున్నప్పటికీ, ఇలాంటి కేసులు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. “ ప్యూర్ హెర్బల్‌ క్రీమ్‌ అని ఆన్‌లైన్‌లో అమ్మే చాలా ఉత్పత్తుల్లో బలమైన స్టెరాయిడ్లు కలిపి ఉంటాయి. అవి తాత్కాలికంగా దద్దుర్లు, మంట తగ్గించినా.. దీర్ఘకాలంగా వాడితే చర్మం వాటిపై ఆధారపడిపోతుంది. ఆపిన వెంటనే పరిస్థితి మరింత దిగజారుతుంది. దీర్ఘకాలిక వాడకంతో అడ్రినల్‌ గ్రంథుల పనితీరు దెబ్బతింటుంది, శాశ్వత నష్టం కలిగిస్తుంది” అని డా. వాంగ్ తెలిపారు.

చర్మ వ్యాధుల చికిత్సలో నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన సూచించారు. టింగ్‌టింగ్‌ ఘటన చైనా సోషల్‌ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. పదేళ్లుగా డాక్టర్‌ సలహా లేకుండా క్రీమ్‌ వాడిందంటే నమ్మలేకపోతున్నామని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు “ఇలాంటి క్రీమ్‌లు అమ్మేవాళ్లు మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు” అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..