AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: కరెంట్‌తో నడిచే కారు.. గంటకు 503 కి.మీ. వేగం!

ఎలక్ట్రిక్ కార్లు అంటే నెమ్మదిగా వెళ్తాయని అనుకుంటున్నారా? అయితే ఆ ఆలోచనను మార్చుకోవాల్సిందే! ఎందుకంటే చైనాకు చెందిన ఓ ఎలక్ట్రిక్ హైపర్‌కార్‌ గంటకు ఏకంగా 503 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కేవలం బ్యాటరీ శక్తితో నడిచే ఈ కారు 500 కి.మీ. వేగం అనే అసాధ్యమనుకున్న మైలురాయిని దాటేసింది. అంతేకాదు ఉత్పత్తి కార్ల వేగం విభాగంలో సరికొత్త రికార్డు సృష్టించింది.

Video: కరెంట్‌తో నడిచే కారు.. గంటకు 503 కి.మీ. వేగం!
Byds Electric Hypercar Smashes Speed Record Hits 503 Kmph
Sharada V
|

Updated on: Nov 09, 2026 | 3:38 PM

Share

చైనాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ BYD తన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల బ్రాండ్ యాంగ్‌వాంగ్‌ ద్వారా ఈ అద్భుతాన్ని సాధించింది. ఆ సంస్థ రూపొందించిన Yangwang U9 Xtreme హైపర్‌కార్‌ గంటకు 503.17 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. నవంబర్ 6న అంతర్జాతీయ ఆటోమొబైల్ సమాఖ్య (FIA) ఈ రికార్డును అధికారికంగా గుర్తించింది.

అబుదాబి రహదారిపై రికార్డు వేట

ఈ రికార్డు కోసం ప్రత్యేకంగా వేగం పరీక్ష నిర్వహించారు. యూఏఈలోని అబుదాబి అల్ ధఫ్రా ప్రాంతంలో ఉన్న షేక్ ఖలీఫా బిన్ జాయెద్ ఇంటర్నేషనల్ రోడ్ (E11)ను ఇందుకోసం ఎంచుకున్నారు. స్థానిక అధికారుల సహకారంతో హైవేలోని 10 కిలోమీటర్ల మేర రహదారిని మూసివేశారు. అందులో ఏడు కిలోమీటర్ల పొడవైన నేరుగా ఉన్న మార్గంపై కారు వేగాన్ని పరీక్షించారు.

జర్మనీకి చెందిన ప్రముఖ రేసింగ్ డ్రైవర్ మార్క్ బాసెంగ్ ఈ హైపర్‌కార్‌ను నడిపారు. కారు వేగం క్రమంగా పెరుగుతూ చివరకు గంటకు 503.17 కిలోమీటర్లకు చేరుకుంది. దీంతో 500 కి.మీ. వేగ పరిమితిని దాటిన ఉత్పత్తి కారుగా U9 Xtreme చరిత్ర సృష్టించింది.

అంత వేగంలోనూ అదుపు తప్పకుండా ఉండేందుకు..

గంటకు 500 కిలోమీటర్లకు పైగా వేగంతో కారు ప్రయాణించాలంటే ఇంజిన్ శక్తి ఒక్కటే సరిపోదు. ఆ వేగాన్ని తట్టుకునేలా కారు స్థిరంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. అందుకే ఈ రికార్డు ప్రయత్నానికి ముందు ఇంజినీర్లు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు.

కారు వెనుక భాగంలోని వింగ్ కోణాన్ని మార్చి, వెనుక చక్రాలపై పట్టు పెరిగేలా చేశారు. రహదారిపై చిన్నపాటి ఎగుడుదిగుళ్లు ఎదురైనా కారు అదుపు తప్పకుండా ఉండేందుకు సస్పెన్షన్ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. టైర్లలో గాలి ఒత్తిడిని కూడా ప్రత్యేకంగా సర్దుబాటు చేశారు. ఇక అత్యంత వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు బ్యాటరీ, మోటార్లు వేడెక్కకుండా వాటి ఉష్ణోగ్రతలను నియంత్రించారు.

3,019 పీఎస్‌ పవర్‌.. నాలుగు మోటార్ల బలం!

ఈ కారు ప్రత్యేకత కేవలం దాని వేగం మాత్రమే కాదు.. దాని వెనుక ఉన్న సాంకేతికత కూడా ఆశ్చర్యపరుస్తుంది. Yangwang U9 Xtremeలో నాలుగు స్వతంత్ర ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇవన్నీ కలిపి 3,019 పీఎస్‌ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఒక్కో మోటారు నిమిషానికి 30,000 సార్లు తిరిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రతి టన్ను బరువుకు 1,217 పీఎస్‌ శక్తి లభించేలా ఈ కారును రూపొందించారు.

అధిక శక్తిని సమర్థంగా నిర్వహించేందుకు 1,200 వోల్టుల ఎలక్ట్రికల్ వ్యవస్థను ఉపయోగించారు. BYD ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ ఇందులో ఉంది. అంతేకాదు.. అధునాతన టార్క్ వెక్టరింగ్ వ్యవస్థ, DiSus-X యాక్టివ్ సస్పెన్షన్ టెక్నాలజీ కూడా ఉన్నాయి. ఈ సస్పెన్షన్ వ్యవస్థ ప్రతి చక్రానికి విడివిడిగా పనిచేస్తూ కారు స్థిరత్వం, నియంత్రణను మెరుగుపరుస్తుంది. ఇంతటి వేగాన్ని తట్టుకునేందుకు గిటి టైర్ సంస్థ సహకారంతో ప్రత్యేకమైన సెమీ-స్లిక్ టైర్లను కూడా అభివృద్ధి చేశారు.

ధనవంతులకే ఈ స్పీడ్‌ కారు.. ప్రపంచవ్యాప్తంగా 30 యూనిట్లే!

అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ హైపర్‌కార్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 30 యూనిట్లను మాత్రమే తయారు చేయాలని BYD నిర్ణయించింది. అంటే ఈ కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి చాలా పరిమితమైన అవకాశమే ఉంటుంది.

ఒకప్పుడు అత్యంత వేగవంతమైన కార్లంటే పెట్రోల్ ఇంజిన్లతో నడిచేవే గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు కూడా వేగంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. గంటకు 503.17 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన Yangwang U9 Xtreme ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల సామర్థ్యానికి కొత్త అర్థం చెప్పింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తలు చూడండి

Follow Us