ఎవరైనా ఏదైనా దక్కించుకోడానికి వెంటపడి వెంటపడి అదేపనిగా విసిగిస్తుంటే.. అబ్బా.. ఆపు నీ కాకిగోల అంటుంటారు.. కానీ ఆ కాకిగోల వెనక ఓ పట్టుదల ఉంటుంది. అంతేకాదు, కాకుల్లో.. మనుషులు నేర్చుకోవలసిన మంచి లక్షణాలు ఎన్నో ఉన్నాయి. కాకులు ఐకమత్యంగా ఉంటాయి. ఎన్నో విలువలు కలిగి ఉంటాయి. వాటి జీవనశైలి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎంతో శుభ్రతను పాటిస్తాయి. ఏదైనా ఓ కాకికి ఆపద వస్తే అన్ని కాకులు అక్కడికి చేరి గోల గోల చేస్తాయి. దానికి తాము అండగా ఉన్నామని భరోసా ఇస్తాయి. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెబుతున్నామంటే.. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ మాంసం దుకాణదారుడు విసిగిస్తుందని.. ఓ కాకిని కట్టేశాడు. అది తెలుసుకున్న మిగతా కాకులు వందలాదిగా అక్కడికి చేరి తమ నిరసన తెలిపాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని తాటిపాక మార్కెట్లోని ఓ చికెన్ షాపు దగ్గర కాకి ఉదయం నుంచి ఆ షాపులో మాంసం వ్యర్ధాలను ఎత్తుకుపోడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో దుకాణదారుడిని చాలా విసిగించింది. ఎలాగైనా ఆ కాకిని పట్టుకోవాలనుకున్న అతను అదను చూసి దానిని పట్టేసుకున్నాడు. ఆ తర్వాత దానిని ఓ తాడుతో అక్కడ స్తంభానికి కట్టేశాడు. దీంతో అది విపరీతంగా అరుస్తూ కనిపించింది.
ఆ కాకి అరుపులకు.. మిగతా కాకులు అలర్ట్ అయ్యాయి.. దీంతో వాటి అరుపులకు వందలాది కాకులు చికెన్ షాపు పై దండెత్తి షాపు చుట్టూ తిరుగుతూ గోల చేస్తూ నిరసన తెలిపాయి. తమ తోటి కాకిని వదిలే వరకూ తగ్గేదే లేదంటూ ఎంత బెదిరించినా అవి వెనక్కిపోలేదు.
కావు కావు మని అరుపులతో మార్కెట్ ప్రాంతంలో గోల గోల చేశాయి. ఈ గోలను భరించలేని మిగిలిన దుకాణదారులు కట్టేసిన కాకిని వదిలేయాలని దుకాణదారుడిని కోరారు. దాంతో దుకాణదారు కాకిని వదిలిపెట్టేశాడు. దీంతో కాకులన్నీ కాసేపు అక్కడే ఉండి.. ఆ తర్వాత వెళ్లిపోయాయి.
దీంతో అక్కడున్నవారంతా కాకుల ఐక్యత ను చూసి ఆశ్చర్యపోయారు. ఇంతటి ఐక్యత మనుషులకు లేకపోయిందే అని ముక్కున వేలేసుకున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..